ఓదెల, జూలై 22 : పోలీసులు తమ విధులను క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా పనిచేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పోత్కాపల్లి పోలీస్ స్టేషన్ ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా సీపీ పోలీస్ స్టేషన్ పరిసరాలను, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించి కేసుల వివరాలను అడిగి తెలుసుకొన్నారు. పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలను నిరోధించాలని సిబ్బందిని ఆదేశించారు. పారదర్శకంగా పోలీసింగ్ ఉండాలి అని ప్రజలకు పోలీసు సేవలను వేగంగా అందించాలని సిబ్బందికి తెలిపారు.
పెట్రోలింగ్ పెంచాలని, డయల్ 100 కాల్స్ పై సిబ్బంది వేగంగా స్పందించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవగాహన కల్పించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు పని చేయాలని, సైబర్ నేరాలు జరగకుండా ప్రజలు సైబర్ మోసాలకు గురి కాకుండా అవగాహన కల్పించాలని సూచించారు. బాగా పని చేసే సిబ్బందికి రివార్డ్స్, ప్రోత్సాహకాలు ఉంటాయన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్, బిట్లు, పెట్రోలింగ్ పగడ్బందీగా నిర్వహిస్తూ నేరాల నియంత్రణకు కృషి చేయాలని సీపీ తెలిపారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటారు. ఈ తనిఖీల్లో రామగుండం ట్రాఫిక్ ఏసీపీ, పెద్దపల్లి ఇంచార్జ్ ఏసీపీ సీహెచ్ శ్రీనివాస్, సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, పోత్కపల్లి ఎస్ఐ దీకొండ రమేష్, కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐ వెంకటేష్, సిసి హరీష్ తదితరులు ఉన్నారు.