డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వ్యక్తుల వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు, పట్టుబడ్డ వారిని ముప్పు తిప్పలు పెడుతున్న ఘటనలున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఉన్న వ్యక్తి వాహనం నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశాలుండడంతో వాహనం అతనికి ఇవ్వకూడదనేది నిబంధన. సదరు వ్యక్తికి సంబంధించిన వాళ్లు మద్యం మత్తులో లేకుండా, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉంటే.. వారికి వాహనాన్ని అప్పగించే అవకాశాలున్నాయి. కాని పోలీసులు దీనిని పట్టించుకోవడం లేదు.
సిటీబ్యూరో, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): నిత్యం ఆటో నడుపుతూ జీవనం సాగించే ఆటో డ్రైవర్ల వాహనాన్ని సీజ్ చేయడంతో బతుకులు ఆగమయ్యే పరిస్థితి నెలకొంటుంది. రాత్రి వాహనం స్వాధీనం చేసుకున్నా కోర్టులో సదరు వ్యక్తి హాజరయ్యే వరకు ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ ష్యూరిటీగా పెట్టుకొని ఆటోలు ఇవ్వాల్సి ఉన్నా పోలీసులు మాత్రం కోర్టులో హాజరైన తరువాతే ఇస్తుండడంతో డ్రైవర్లు మనోవేదనకు గురవుతున్నారు. కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ మీన్‌రెడ్డి వాహనాన్ని పోలీసులు సీజ్ చేయడంతో ఆందోళనకు గురయ్యాడు. దానికితోడు పోలీసులు కూడా సూటిపోటి మాటలతో దురుసుగా మాట్లాడినట్లు ఆరోపణలున్నాయి. కిరాయికి తీసుకున్న ఆటో కావడంతో యజమానికి సమాధానం చెప్పలేక, తెల్లారితే జీవనం ఎలా అనే ఆలోచనతో మీన్‌రెడ్డి మనోవేదనకు గురయ్యాడంటూ ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టి ఆటో డ్రైవర్ల జీవితాలను ఛిద్రం చేసిందని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 163 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ ఆందోళన చేస్తున్నారు. మీన్‌రెడ్డి కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ముందు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలుసుకున్న ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున బుధవారం ఉదయం మీన్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు. అతని మృతదేహానికి నివాళులర్పించారు.
మౌలాలిలోని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఆటో రిక్షా కార్మికుడు సింగిరెడ్డి మీన్‌రెడ్డి మృతికి ట్రాఫిక్ పోలీసులే బాధ్యత వహించాలని, మృతుడి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆటో రిక్షా కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య డిమాండ్ చేశారు. రాధికా చౌరస్తాలో ఆటో యూనియన్ కార్మికుల ఆధ్వర్యంలో మీన్ రెడ్డి చిత్రపటంతో ధర్నా నిర్వహించారు. ఆటో డ్రైవర్ మీన్‌రెడ్డి పోలీసుల వేధింపుల వల్లే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారయ్య మాట్లాడుతూ పోలీసులు అత్యుత్సాహంతో ఆటోను తీసుకొని వెళ్లారనీ, ఆటో ఇవ్వమని వెళితే మీన్‌రెడ్డిని కొట్టారని, దీంతో మనస్తాపానికి గురైన మీన్‌రెడ్డి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఘటనకు బాధ్యులైన ట్రాఫిక్ ఎస్ఐ, సీఐలను సస్పెండ్ చేయాలని, మీన్‌రెడ్డి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షుడు అహ్మద్, రాధికా ఆటో యూనియన్ నాయకులు శీను, రామంచి, బాలకృష్ణ, మోయిన్, మహేష్, పాండు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఏఎస్‌రావునగర్ డివిజన్ జమ్మిగడ్డలో ఆటో డ్రైవర్ మీన్‌రెడ్డి నివాసం వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికంగా నివసించే అంజిరెడ్డి, పుష్ప దంపతుల పెద్దకుమారుడైన మీన్‌రెడ్డి అవివాహితుడు. కొన్నేళ్ల క్రితం ఉద్దెమర్రి నుంచి అంజిరెడ్డి కుటుంబం ఉపాధి కోసం జమ్మిగడ్డకు వచ్చింది. కుటుంబ సభ్యులు చిన్నా, చితక పనులు చేసుకుంటూ కుటుంబాన్ని ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. 32ఏండ్ల మీన్‌రెడ్డి కిరాయికి ఆటోతీసుకొని రాధిక- దమ్మాయిగూడ మద్య ఆటో తిప్పుతూ ఉపాధి పొందుతున్నాడు. మిగతా ఇద్దరు ప్రైవేటు పనులు చేస్తున్నారు. ఆటో కిరాయిలు సరిగా లభించకపోవడంతో మీన్‌రెడ్డి కొన్ని నెలల తరబడి ఆటో యజమానికి కిరాయి చెల్లించక బాకీ పడ్డాడనీ, పైగా పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఆటోను గుంజుకుపోవడంతో తన అప్పు అలాగే ఉండిపోవడంతో పాటు, బతుకేదెలా అని ఆవేదన చెందాడని పలువురు ఆటో డ్రైవర్లు చెప్పారు. పోలీసులు వచ్చి చెప్పేవరకు తమకు మీన్‌రెడ్డి విషయం తెలియదని తల్లిదండ్రులు విలపించారు. ‘ఏ విషయమూ చెప్పకనే తమనుంచి వెళ్లిపోయావా’ అని మీన్‌రెడ్డి తల్లి పుష్ప మృతదేహంపై పడి రోదించింది. మీన్‌రెడ్డి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి, షేర్మణెమ్మ, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు అహ్మద్, యూనియన్ ప్రతినిధులు పరామర్శించి ఓదార్చారు.
‘మీన్‌రెడ్డి తనతో సన్నిహితంగా ఉండేవాడు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులు ఆటో తీసుకెళ్లడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఆటో అద్దెకు ఇచ్చిన వ్యక్తికి ఇదివరకే బాకీపడ్డా, ఇప్పుడు ఆటో కూడా లేదాయె, అప్పు ఎట్ల గట్టాలె, నేనెట్ల బతకాలె, ఇంట్లోల్లకు ఏం చెప్పాలె’ అని తనతో అన్నాడని మీన్‌రెడ్డి స్నేహితుడు నవాజ్‌ఖాన్ తెలిపాడు. మరునాడే మీన్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడని నవాజ్‌ఖాన్ ఆవేదన వ్యక్తం చేశాడు.
– నవాజ్‌ఖాన్, ఆటో డ్రైవర్
ఆటో కార్మికుల పట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పోలీసులు మీన్‌రెడ్డి ఆటోను గుంజుకుపోయారు, అడిగితే కొట్టారు. దీంతో మీన్‌రెడ్డి మనస్తాపంతో పెట్రోల్ పోసుకొని అంటుపెట్టు కున్నాడు. పోలీసుల ముందే పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుంటే నిర్లక్ష్యం వహించిన పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలి. చనిపోయిన మీన్‌రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం, పోలీసులు ఆర్థిక సహాయం అందించాలి.
– వేముల మారయ్య, ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు