(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : ఫలానా పార్టీ గెలుస్తుందని ప్రీ-పోల్ సర్వేలన్నీ మూకుమ్మడిగా కుండబద్దలు కొట్టి చెప్తాయి. ఆ ఫలానా పార్టీదే విజయమంటూ ప్రజా క్షేత్రంలో పెద్దయెత్తున చర్చ కూడా జరుగుతుంది. తమ బాగోగులు చూసుకొన్న ఆ ఫలానా పార్టీ నాయకుడికే తామందరమూ ఓటేస్తామని ప్రజలంతా కూడా ముక్తకంఠంతో తేల్చి చెప్తారు. పోలింగ్ పూర్తయ్యాక వెలువడే ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లో, ఆ తర్వాత విడుదలయ్యే పోస్ట్-పోల్ సర్వేల్లోనూ ఆ ఫలానా పార్టీకే మెజారిటీ సీట్లు వచ్చినట్టు తేలుతుంది. అయితే, ఎప్పుడైతే ఎన్నికల సంఘం (ఈసీ) అధికారికంగా ఫలితాలను విడుదల చేస్తుందో.. అప్పుడు అంతా తారుమారు అవుతుంది. అప్పటివరకూ విజయం సాధిస్తుందనుకొన్న ఆ ఫలానా పార్టీకి అనూహ్యంగా ఓట్లు తగ్గుతాయి.
ఎవరూ ఊహించనటువంటి మరో పార్టీ విచిత్రంగా విజయం సాధిస్తుంది. ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హర్యానా తదితర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఓట్ల జాబితాలో గోల్మాల్, ఓట్ల చోరీ, రిగ్గింగ్ తదితర విషయాలు దేశంలో జరుగుతున్న ఎన్నికల ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ ఓట్లను సెకండ్ల వ్యవధిలో తొలగించే సాంకేతికత అందుబాటులో ఉన్నప్పటికీ, ఈసీ ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి సానుకూలంగా ఈసీ వ్యవహరిస్తున్నదని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఓట్ల జాబితాలో గోల్‌మాల్‌పై లోతైన చర్చ అవసరమని రాజకీయ విశ్లేషకులు నొక్కి చెప్తున్నారు.

ఏదైనా నియోజకవర్గంలో ఓట్ల జాబితాలో గోల్మాల్ చేయాలనుకొంటే ప్రధానంగా ఐదు విధానాల్లో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
1. డూప్లికేట్ ఓట్లు (నకిలీ ఓట్లు): ఫొటో, ఈపీఐసీ నంబర్, ఓటర్ ఐడీ నంబర్.. ఒకటి కంటే ఎక్కువ బూత్‌లు, లేదా నియోజకవర్గాల్లో రిజిస్టరయ్యి ఉన్నట్లయితే ఆ ఓట్లను డూప్లికేట్ ఓట్లు లేదా నకిలీ ఓట్లు అంటారు.
2. చెల్లని చిరునామా: ఓటరు కార్డులో పేర్కొన్న చిరునామా ఎక్కడా ఉండదు. వేరేవరి చిరునామానో ఉద్దేశపూర్వకంగా ఈ నకిలీ కార్డులకు వాడుకొంటారు. ఇతర రాష్ర్టాల్లోని ఇంటి చిరునామాలను పిన్‌కోడ్ నంబర్ మార్చి వాడుకొంటారు. జీరో అడ్రస్ పేరిట కొన్ని నకిలీ ఓటరు కార్డులు జారీ అయినట్టు ఢిల్లీకి చెందిన నందకుమార్ అనే రాజకీయ విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు.
3. బల్క్ ఓటర్లు: ఒకే ఇంటి నంబర్‌పై 10 మందికి మించి ఓటర్లు నమోదు చేసుకొంటే బల్క్ ఓటర్లుగా పిలుస్తారు. అయితే, ఇటీవలి కాలంలో నకిలీ ఓట్ల సృష్టికి ఈ బల్క్ ఓటర్ల విధానాన్ని విరివిగా వినియోగిస్తున్నారు. బెంగళూరులోని 10 చదరపు అడుగుల ఓ ఇంటిలో ఏకంగా 80 మంది ఓటర్లు ఉన్నట్టు ఇండియా టుడే క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది.
4. ఫారమ్-6 దుర్వినియోగం: కొత్త ఓటు జోడింపునకు ఈ ఫారమ్-6ను వినియోగిస్తారు. తప్పుడు పేరు, ఒకే పేరుతో పలు ఎంట్రీలు, ఒకే తరహా వివరాలతో బల్క్ ఓటర్లు, తప్పుడు చిరునామాలు, నకిలీ ధ్రువపత్రాలను ఇవ్వడం వంటివి మిస్యూజ్ ఆఫ్ ఫారమ్-6 కిందకు వస్తాయి. ఉదాహరణకు అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో కనిపించని కొందరు ఓటర్లు.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఉన్నట్టుండి పెద్దస్థాయిలో కనిపించడం మిస్యూజ్ ఆఫ్ ఫారమ్-6 కిందకు వస్తుందని చెప్పొచ్చు.
5. ఫారమ్-7 దుర్వినియోగం: ఓట్ల తొలగింపునకు ఈ ఫారమ్-7ను వినియోగిస్తారు. ఉదాహరణకు అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో కనిపించిన కొందరు ఓటర్లు.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఉన్నట్టుండి మాయమవ్వడం మిస్యూజ్ ఆఫ్ ఫారమ్-7 కిందకు వస్తుందని చెప్పొచ్చు. లక్షిత రాజకీయ పార్టీకి నష్టంచేకూర్చేలా ఆ పార్టీ సానుభూతిపరుల ఓట్లను అకారణంగా తొలగించడం ఈ ఫారమ్-7 దుర్వినియోగం కిందకు వస్తుంది.

2024 హర్యానా ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఎన్నికల్లో పోల్ అయిన మొత్తం ఓట్లలో దాదాపు 12.5 శాతం ఓట్లు నకిలీవేనని, మొత్తంగా 25 లక్షల ఓట్లను దొంగిలించారని మండిపడ్డారు. హర్యానా ఎన్నికల్లో బ్రెజిల్‌కు చెందిన ఓ మోడల్‌కు 22 ఓట్లు ఉన్నాయని తెలిపారు. ఆమె ఫొటో ఒకటే అయినప్పటికీ, సీమా, స్వీటీ, సరస్వతి వంటి వివిధ పేర్లతో నకిలీ ఓట్లను సృష్టించారన్నారు. బీజేపీ ఈ ఓట్ల చోరీకి తెగబడిందన్న ఆయన.. ఓట్ల దొంగలను ఈసీ కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ మేరకు ‘హైడ్రోజన్ బాంబు’ పేరిట బుధవారం మీడియా సమావేశంలో బీజేపీ, ఈసీపై రాహుల్ నిప్పులు చెరిగారు.

రాహుల్ ఆరోపణలపై ఈసీ కౌంటర్ ఇచ్చింది. హర్యానా ఎన్నికల్లో ఓటరు జాబితాపై కాంగ్రెస్ ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదని చెప్పింది. పోలింగ్ స్టేషన్లలో కాంగ్రెస్ పోలింగ్ ఏజెంట్లు ఆ సమయంలో ఏం చేస్తున్నారని నిలదీసింది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను రాహుల్ సమర్థిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? అని ప్రశ్నించింది. రాహుల్ ఆరోపణలు అన్నీ నిరాధారమైనవేనని బీజేపీ మండిపడింది. సోనియా గాంధీని ఉద్దేశిస్తూ ఇటలీ మహిళకు దేశంలో ఓటు హక్కు ఉందంటూ ఎద్దేవా చేసింది.