సిటీబ్యూరో, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే సురక్షితమైన నగరంగా పేరుగాంచిన హైదరాబాద్ నేడు నేరాలతో అల్లకల్లోలంగా మారింది. పట్టపగలు రహదారులపై కత్తులతో రౌడీషీటర్లు హల్చల్ చేస్తూ ఒకరికొకరు పొడుచుకుంటున్నారు. హత్యలు, హత్యా యత్నాలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు, తుపాకుల కాల్పులతో నేడు హైదరాబాద్ మహానగరం రక్తసిక్తంగా మారుతుంది. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో నేరాలు పెరుగుతూ సామాన్య ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నది. జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం ఒక రౌడీషీటర్ మరో రౌడీషీటర్‌ను కత్తితో విచక్షణా రహితంగా పొడిచి హత్యా యత్నం చేసి పరారయ్యాడు. సోషల్ మీడియాలో రౌడీషీటర్ కత్తితో పొడుస్తున్న వీడియోలు వైరల్ కావడంతో యావత్ రాష్ట్రం ఏమి జరుగుతుందని భయాందోళనకు గురయ్యారు. మల్కాజిగిరిలో ఓ ఆటో డ్రైవర్ పోలీసుల వేధింపులతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. మెట్రో రైల్లో ప్రయాణికుడిపై యువకులు దాడి చేయడం. దళిత మహిళపై అత్యాచారం చేసిన ఘటన, గో రక్షక్పై రౌడీషీటర్ తుపాకీ కాల్పులు, ఇలా నగరంలో రోజు ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఘటనలు నిత్యం జరుగుతూ ఉన్నాయి.
జగద్గిరిగుట్ట లాస్ట్ బస్‌స్టాప్ వద్ద రంగారెడ్డినగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ రోషన్‌సింగ్ (25)పై జగద్గిరిగుట్టకు చెందిన రౌడీషీటర్ బాలశౌరి రెడ్డి (26) అందరూ చూస్తుండగానే కత్తితో స్వైరవిహారం చేస్తూ విచక్షణా రహితంగా దాడి చేశాడు. రక్తపుమడుగులో ఉన్న రోషన్‌సింగ్ తప్పించుకునేందుకు యత్నించినా వదలకుండా సుమారు పది సార్లు కత్తితో పొడిచాడు. చుట్టు పక్కల ప్రజలు కేకలు వేయడంతో వారిపై సైతం బెదిరింపులకు దిగాడు. పది పదిహేను నిమిషాల పాటు అదే ప్రాంతంలో రౌడీషీటర్ బాలశౌరి రెడ్డి హల్చల్ చేసినా పోలీసులు మాత్రం అక్కడికి రాలేదు. సెప్టెంబర్ నెలలో కుషాయిగూడ పోలీసు స్టేషన్ పరిధిలో శ్రీకాంత్ రెడ్డి అనే రియల్టర్‌పై ఓ రౌడీషీటర్, మరో వ్యక్తి హెచ్‌బీకాలనీలోని అతని ఇంటి సమీపంలో పట్టపగలే కత్తితో దారుణంగా పొడిచి చంపారు. నాచారంలో మురళీకృష్ణ అనే వ్యక్తి టిఫిన్ చేస్తుండగా చట్నీ మీద పడిందని మహ్మద్ జునైద్, షేక్ సైఫుద్దీన్, మణికంఠ, మరో బాలుడు కలిసి కారులో ఎక్కించుకొని నిర్బంధించి అతనిని హత్య చేశారు. గత నెల పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో గౌరరక్షక్ దళ్‌కు చెందిన సోనూసింగ్ (28) అనే యువకుడిపై ఇబ్రహీం అనే రౌడీషీటర్ కాల్పులకు దిగాడు. దీంతో తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో 51 ఏండ్ల జీహెచ్ఎంసీ కార్మికురాలిని ఎర్రగడ్డ ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద లైంగికదాడికి గురైంది.
గత నెల 21న బేగంపేటకు చెందిన కృష్ణ కిశోర్ (62) అనే న్యాయవాది అమీర్‌పేటలో మెట్రో రైలు ఎక్కాడు. అక్కడ వయోవృద్ధుల సీటు ఇవ్వమని అడిగినందుకు సివ్వాల సునీల్ కుమార్, రాజేశ్, కలిశెట్టి అశోక్ అనే ముగ్గురు పోకిరీలు దాడి చేసి కొట్టడమే కాకుండా లక్డీకాపూల్ స్టేషన్లో రైలు దిగే సమయంలో పట్టాలపైకి నెట్టి వేశారు. కుషాయిగూడ పోలీసు స్టేషన్ పరిధిలో పోలీసులు వేధింపులు భరించలేక ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రేటర్లో ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. సామాన్య ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. పోలీసు యంత్రాంగం శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైందని ప్రజలు ఆరోపిస్తున్నారు.