సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 18 : ప్రజలు, వాహనదారులు రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం భాగస్వామ్యం కావాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ పిలుపునిచ్చారు. అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా శనివారం సూర్యాపేట పట్టణ కేంద్రంలో పోలీసు సిబ్బంది హెల్మెట్లు ధరించి చేపట్టిన భారీ బైక్ ర్యాలీని ప్రారంభించి ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లాను రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఈ బైక్ ర్యాలీ కోసం పోలీసు సిబ్బందికి అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత లోగో కలిగిన హెల్మెట్స్ పంపిణీ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ర్యాలీ ప్రారంభమై కోర్టు చౌరస్తా, పిఎస్ఆర్ సెంటర్, శంకర్ విలాస్ సెంటర్, ఎంజీ రోడ్డు మీదుగా కొత్త బస్టాండ్ వరకు నిర్వహించారు.
కొత్త బస్టాండ్ వద్ద పోలీసు సిబ్బంది రోడ్డు భద్రత మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా స్వచ్చందంగా ముందుకు వచ్చి హెల్మెట్స్ అందజేసిన సెవెన్ స్టార్ సోలార్ ఎంటర్ప్రైజెస్ యజమాని మల్లేశ్ ను ఎస్పీ అభినందించి సన్మానిం చారు. ఈ ర్యాలీలో అదనపు ఎస్పీలు రవీందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, డీఎస్పీలు ప్రసన్నకుమార్, నరసింహాచారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఆర్ముడ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ప్రవీణ్, జానయ్య, ఆర్ఎస్ఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సూర్యాపేటలో పోలీసుల భారీ బైక్ ర్యాలీ