– సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
నూతనకల్, ఏప్రిల్ 18 : పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. శనివారం 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా నూతనకల్ తాసీల్దార్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. సాదా బైనమా దరఖాస్తులు క్రమబద్ధీకరణ ఫైల్స్ అన్నింటిని పారదర్శకంగా పూర్తి చేయుటకు ప్రతి లబ్ధిదారుని ఫైలు సమగ్రంగా విచారణ చేసి భూ భారతి చట్టం- 2025, తదుపరి వచ్చిన జీవోల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలన్నారు. సర్వే, సరిహద్దుల చట్టం, 1923 ప్రకారం రీ సర్వే మండలంలోని తొమ్మిది గ్రామాలలో నిర్వహిస్తున్నందున సీలింగ్ భూమిలో దీర్ఘకాలంగా అనుభవదారుగా ఉండి కొనుగోలు చేసిన రైతులందరికీ పట్టాలు మంజూరీ చేయుటకు ప్రభుత్వ ఆదేశముల ప్రకారం వెంటనే రీ సర్వే ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు.
శ్రీరామ ఎల్లమ్మ, భర్త నరసయ్య ఎర్రపహాడ్ గ్రామ వాసి 2009లో సర్వే నెంబరు 92లో ఎకరం భూమిని కొనుగోలు చేసి సాదా బైనమా దస్తావేజు క్రమబద్ధీకరణ కోసం 2020లో దరఖాస్తు చేసుకున్నారు. క్రమబద్ధీకరణ ఫైల్ పెండింగ్ లో ఉన్నందున తాసీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ని కలువగా వెంటనే ఆమె ఫైల్ ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ సునీత, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.