KTR : నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పార్లమెంట్లో దక్షిణ భారతదేశ ప్రాధాన్యాన్ని తగ్గిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు ఇప్పటికే 2023లో ఆమోదించిందని, ఆ బిల్లుకు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో ముడిపెట్టాల్సిన అవసరమే లేదని ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
నియోజకవర్గాల పునర్విభజనకు 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకున్నా, తాజా జనాభా గణనను ప్రాతిపదికగా తీసుకున్నా దక్షిణ భారతదేశం తీవ్రంగా నష్టపోతుందని కేటీఆర్ అన్నారు. ఈ విషయం కేంద్రంలోని పాలకులకు కూడా బాగా తెలుసని చెప్పారు. రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీని తాజా బిల్లు పొందలేదని స్పష్టంగా తెలిసినప్పటికీ, మోదీ ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టిందని విమర్శించారు.
పార్లమెంటులో దక్షిణ భారతదేశ గళాన్ని అణచివేస్తున్న తీరుపై BRS తరపున తాము తీవ్ర ఆందోళనను, గాఢ నిరసనను వ్యక్తంచేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు ఇప్పటికే ఆమోదం పొందింది కాబట్టి, ఈ దేశ మహిళలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. మహిళా రిజర్వేషన్ను అమలు చేయాలనుకుంటే ప్రస్తుతం ఉన్న 543 స్థానాలతోనే అమలు చేయవచ్చని చెప్పారు.
పార్లమెంటులో దక్షిణ భారతదేశానికి ప్రస్తుతం 24% స్థానాలు ఉన్నాయని, ఆ 24 శాతం స్థానాలు యథాతథంగా కొనసాగేలా చూడాలని అన్నారు. ఒకవేళ దక్షిణ భారత ప్రాధాన్యాన్ని 24 శాతం కంటే తగ్గిస్తే ఈ దేశ నిర్మాణంలో విశేష కృషిచేసిన దక్షిణ భారత ప్రజల నుంచి తీవ్రమైన నిరసనలు, ఆగ్రహం వ్యక్తమవుతాయని కేటీఆర్ హెచ్చరించారు.
#WATCH | Jagtial, Telangana: BRS working president KT Rama Rao says, “Women’s Reservation Bill was already passed by the Parliament in 2023. There was no need for this Bill to be linked with the delimitation exercise. Knowing fully well that if 2011’s census or latest census… pic.twitter.com/J6CtFaLrvA
— ANI (@ANI) April 18, 2026