సుజాతనగర్, ఫిబ్రవరి 10: దొంగలు ఒక ఇంట్లో చోరీ చేయాలనుకుంటే ముందుగా ఆ ఇంట్లో ఎవరెవరూ ఉంటారు.. ఎవరెవరు ఎప్పుడు బయటకు వెళ్తారు.. ఎప్పుడు ఊరెళతారు.. ఎప్పుడు తిరిగి వస్తారు.. అనే విషయాలపై కొన్నిరోజులు రెక్కీ నిర్వహిస్తారు.. అందుకు వారు చిరువ్యాపారుల అవతారం ఎత్తుతారు.. బిచ్చగాళ్ల వేషం వేస్తారు.. చివరకు వారికి అనుకూలమైన సమయం వచ్చినప్పుడు చోరీలకు పాల్పడతారు. ముఖ్యంగా తాళం వేసి ఉన్న ఇండ్లపైనే వీరి కన్ను. ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు ఏటూరు నాగారం జిల్లాలో సమ్మక్క సారలమ్మ జాతర జరుగనున్నది. భద్రాద్రి జిల్లా నుంచి లక్షలాది మంది ఇంటిల్లిపాది జాతరకు వెళ్తారు. ఇంటికి తాళం వేసి కనీసం మూడు రోజులు వెళ్తారు. ఇదే సమయాన్ని దొంగలు అవకాశంగా తీసుకునే ప్రమాదం ఉంది. ఈ తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. జాతరకు వెళ్లే ముందు సమీప పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని పోలీస్ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. అవసరమైతే ఆ ప్రాంతంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామంటున్నారు.
జాతరకు వెళ్లే వారు ఎక్కడికి వెళ్తున్నారు ? ఎన్ని రోజులు వెళ్తున్నారు? తిరిగి ఎప్పుడొస్తారనే వివరాలను పోలీస్ స్టేషన్లో తెలియజేయాలి. చోరీల నివారణకు యజమానులు ఇంటి ఆవరణలో వైఫై బేస్డ్ రోబో కెమెరాలు అమర్చుకోవాలి. ఈ జాగ్రత్త పాటిస్తే ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే మొబైల్‌కు అలర్ట్ రింగ్‌టోన్ వస్తుంది. అది ఘటనా స్థలంలో ఉన్న వారికి వినిపించదు. దీంతో వారు చోరీకి పాల్పడుతుండగానే నిందితులను పట్టుకునే అవకాశం ఉంటుంది. ఇదే విధంగా నాలుగు సెల్ఫోన్లను కనెక్ట్ చేయవచ్చు. ఈ నంబర్లలో ఒకటి పోలీస్ అధికారికీ కనెక్ట్ చేయవచ్చు. ప్రస్తుతం రూ.2,500 నుంచి వై ఫైతో నడిచే సీసీ కెమెరాలు దొరుకుతున్నాయి. విక్రయదారులు ఇదే ధరకు సీసీ కెమెరాతో పాటు ఎస్డీ కార్డులూ ఇస్తున్నారు.
అపార్ట్మెంట్లలో ఉండే వారు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. అంతా కలిసి వాచ్‌మెన్‌ను నియమించాలి. అతనిపై నిఘా ఉండాలి. అపార్ట్మెంట్లో కొత్తగా ఎవరు అద్దెకు వచ్చినా వారి పూర్తి వివరాలు సేకరించాలి. అవసరమైతే వారి ఆధార్‌కార్డు, చేసే పని, సొంత ఊరి వివరాలు తెలుసుకోవాలి. వారి ఇంటికి వచ్చిపోయే వారి వివరాలనూ సేకరిస్తే మంచిది.
మహిళలు బయటకు వెళ్లేటప్పుడు విలువైన నగలు ధరించకపోవడం మంచిది. ఒకవేళ ధరించాల్సి వస్తే నగలు కనిపించకుండా చూసుకోవాలి. వీలైనంత వరకు నగలు తక్కువగా ధరించడం మంచిది. ఇంటి భద్రతకు ప్రస్తుతం మార్కెట్లో సైరన్ తాళాలు అందుబాటులోకి వచ్చాయి. ఎవరైనా తాళాన్ని తాకితే సైరన్ మోగడం దీని ప్రత్యేకత. ఒకవేళ ఇంట్లో నివసిస్తున్న వారు ఊరు వెళ్లినా పొరుగింటి వారిని సైరన్ అలర్ట్ చేస్తుంది. ఇంటి ముందున్న గేటుకు తాళం వేయకపోవడం మంచిది. బెడ్రూం లైట్ వేసి ఉంచితే మేలు. నగలు, నగదును బీరువాలో దాచి పెట్టకుండా బ్యాంకుల్లో భద్రపర్చుకోవడమే అన్ని విధాలా మంచిది.
పట్టణాలతో పాటు గ్రామాల్లో 24 గంటల పాటు బ్లూకోల్ట్ బృందాలు తిరుగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలి. 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలోనే పోలీసులు మీ వద్దకు చేరుకుంటారు. జాతరకు వెళ్లే వారు ముందుగానే పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలి. ముందుగా చెప్తే ఆ ప్రాంతంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తాం.
-డీఎస్పీ వెంకటేశ్వరబాబు, కొత్తగూడెం