‘మా ప్రాణాలు పోయినా ఇక్కడి నుంచి కదలం. మా భూముల్ని ఎప్పటికీ వదులుకోం’ అని రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలోని రైతు కుటుంబం అధికారుల చర్యలను తీవ్రస్థాయిలో ప్రతిఘటించింది. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూమిలో రైతు వేసిన పత్తి చేనును ధ్వంసం చేసేందుకు టీజీఐఐసీ అధికారులు రెండోరోజూ బుల్డోజర్లతో వచ్చారు. బుల్డోజర్ బొక్కెనలో పడుకొని అడ్డుకుంటున్న మహిళను అరెస్టు చేస్తున్న పోలీసులు
యాచారం, జూలై 2: ‘మా ప్రాణాలు పోయినా ఇక్కడి నుంచి కదలబోము. మా భూముల్ని ఎప్పటికీ వదులుకోము’ అని రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో రైతు కుటుంబం అధికారుల చర్యలను తీవ్రస్థాయిలో ప్రతిఘటించింది. ఫార్మాసిటీ ఏర్పాటు కోసం సేకరించిన భూమిలో రైతు వేసిన పత్తి చేనును ధ్వంసం చేసేందుకు టీజీఐఐసీ అధికారులు రెండోరోజూ జేసీబీలతో పొలాల్లోకి వచ్చారు. సుమారు 100 మంది పోలీసులు ఫార్మా భూముల్లో పహారా కాశారు. మేడిపల్లి గ్రామానికి చెందిన వన్నవాడ శివరాములు అనే రైతు 278 సర్వేనంబర్‌లోని ఐదెకరాల్లో పత్తి పంటను సాగుచేశాడు. ఆ పంటను అధికారులు గురువారం జేసీబీలతో నాశనం చేయిస్తుండగా, అదిచూసిన రైతు శివరాములు కుటుంబసభ్యులు ఒక్కసారిగా అడ్డగించారు.
తమ పంటను నాశనం చేయొద్దని మహిళా రైతులు వన్నవాడ మంజుల, వన్నవాడ సంతోష, వన్నవాడ వరలక్ష్మి, వన్నవాడ మానస జేసీబీ బొక్కెనలో పడుకొని ‘మా ప్రాణాలు పోయినా ఇక్కడి నుంచి కదిలేదిలేదు‘ అని భీష్మించుకొని కూర్చున్నారు. హైదరాబద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు వారిని బలవంతంగా లాగి అక్కడి నుంచి ఈడ్చిపడేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట జరిగి కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. పంట ధ్వంసం చేయకుండా జేసీబీలకు అడ్డుతగిలిన రైతులు వన్నవాడ శ్రీకాంత్, వన్నవాడ గణేశ్‌ను ఎత్తుకెళ్లి పోలీస్ వ్యానులో పడేశారు.

మహిళా రైతులను మహిళా కానిస్టేబుళ్లు బలవంతంగా లాక్కెళ్లి వ్యాను ఎక్కించారు. అరెస్టు చేసిన ఆరుగురు రైతులను హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ ఠాణాకు తరలించారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వారిని స్టేషన్లోనే ఉంచారు. ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు వెళ్లి వారిని విడిపించారు. వెంటనే పూర్తిస్థాయి పరిహారం ఇవ్వాలని, రైతులకు ఇవ్వాల్సిన ఎకరాకు 121 గజాల ఫార్మా ప్లాట్లకు సంబందించిన డాక్యుమెంట్లు వెంటనే ఇవ్వాలని రైతు శ్రీకాంత్ డిమాండ్ చేశారు. కోర్టు స్టే ఉన్న భూముల్లోకి రావొద్దని, అక్రమంగా వస్తే ఊరుకొనేదిలేదని హెచ్చరించారు.
టీజీఐఐసీ అధికారులు రాజేందర్, శివ దగ్గరుండి జేసీబీలతో రైతులు సాగుచేసిన పంట చేలను నాశనం చేయించడాన్ని ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ సమన్వయకర్త కవుల సరస్వతి తప్పుబట్టారు. కోర్టు స్టే ఆర్డర్ ఉన్న భూముల్లోకి అక్రమంగా రావడమే కాకుండా రైతులు కష్టపడి సాగుచేసుకున్న జొన్న, పత్తి చేలను జేసీబీలతో నాశనం చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇదే విషయమై ఆమె టీజీఐఐసీ అధికారులు రాజేందర్, శివను నిలదీయడంతో కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకొన్నది. ఎలాంటి పనులు చేయొద్దన్న ఆర్డర్ కాపీని వారికి చూపించారు. రైతులకు పూర్తిస్థాయి నష్టపరిహారం ఇవ్వాలని, రైతులకు ఇవ్వాల్సిన ఫార్మాప్లాట్ల రిజిస్ట్రేషన్ పత్రాలను వెంటనే ఇవ్వాలని అప్పటివరకు ఫార్మా భూముల్లోకి రావొద్దని హితవు పలికారు.