మేడ్చల్, జూన్ 12 : చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన వ్యక్తిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముమ్మర దర్యాప్తు అనంతరం మహిళ మెడలో నుంచి మంగళసూత్రం లాక్కెళ్లిన ఇద్దరు వ్యక్తులను గుర్తించి, ఒకరిని చాకచక్యంగా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం ఏసీపీ శంకర్ రెడ్డి వెల్లడించారు. మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మునీరాబాద్‌లో ఉన్న రత్నదీప్ కంపెనీలో అత్వెల్లి పరిధిలో నివాసం ఉండే పాతూరి శోభారాణి విధులు నిర్వహిస్తున్నారు.
గత నెల 29వ తేదీన రాత్రి 7 గంటల ప్రాంతంలో విధులను ముగించుకొని, కోర్టుకు సమీపంలో ఉన్న హెచ్‌పీ పెంట్రోల్ బంక్ వద్ద కంపెనీ బస్ దిగారు. అక్కడి నుంచి మైల్స్టోన్ వెంచర్ వైపు నడచుకుంటూ వెళ్తుండగా కల్వర్టు వద్ద బైక్‌పై ముఖాలకు మాస్క్‌లు పెట్టుకొని వచ్చిన ఇద్దరు ఆమెను అడ్డగించారు. ఒకరు శోభారాణితో మాట్లాడుతుండగానే మరొకరు ఆమె మెడలో నుంచి బంగారు మంగళ సూత్రం చైన్‌ను లాక్కొని బైక్‌పై పారిపోయారు. అదే రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో బాధితురాలు మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సీఐ సత్యనారాయణ డీసీపీ కోటిరెడ్డి, ఏసీపీ శంకర్ రెడ్డి మార్గదర్శకత్వంలో దర్యాప్తు చేపట్టారు.
సీసీ కెమెరా ఫూటేజీలను పరిశీలించిన అనంతరం శంషార్ సింగ్, రూప్సింగ్ చాతూర్ సింగ్(31)లు దొంగతనానికి పాల్పడినట్టు గుర్తించారు. ఈ కేసులో ఏ2గా ఉన్న రూప్‌సింగ్‌పై కర్ణాటకలోని బీదర్ జిల్లా గాంధీ గంజ్ పోలీస్‌స్టేషన్‌లో కూడా గతం కేసు నమోదైంది. ఏ2గా ఉన్న మహారాష్ట్రకు చెందిన రూప్సింగ్ జవహర్‌నగర్ పీఎస్ పరిధిలోని బాలాజీనగర్‌లో ఉంటూ స్క్రాప్ దుకాణంలో పని చేస్తున్నట్టు పోలీసులు గుర్తించి, పట్టుకున్నారు. నిందితుడి నుంచి బైక్, ఒక సెల్‌ఫోన్, చైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతడిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో సీఐ సత్యనారాయణ, డీఐ కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.