హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానానికి అగ్రివర్సిటీ దిక్సూచిగా మారాలని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 62వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ‘భారత దేశ హరితవిప్లవ సాధనలో ఇందిరాగాంధీ విశేష సేవలు’ అన్న అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణ, భారతదేశానికి 62 ఏండ్లుగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అసమాన సేవలు అందిస్తున్నదని అభినందించారు. మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, లాల్ బహదూర్‌శాస్త్రి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయం వివిధ పంటల్లో రూపొందించిన సుమారు 520 వంగడాలు రైతుల మన్ననలు పొందాయని పేర్కొన్నారు. స్వామినాథన్ వంటి ప్రముఖ శాస్త్రవేత్తల తోడ్పాటుతో ఇందిరాగాంధీ అమ లు చేసిన హరిత విప్లవం కారణంగా నేడు ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి దేశం ఎదిగిందని వెల్లడించారు.
వరి, మొకజొన్న పంటల ఉత్పత్తిలో రాష్ట్రం రికార్డు సాధించిందని తెలిపారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయరంగం ఎదురొంటున్న సవాళ్ల పరిషారానికి అగ్రి వర్సిటీ మరింతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, బెంగళూరు ప్రొఫెసర్ అండ్ హెడ్ మధుర స్వామినాథన్ మా ట్లాడుతూ.. ఆహార ఉత్పత్తుల్లో దేశం స్వయం సమృద్ధి సాధించిన కారణంగా ఇతర దేశాలకు తోడ్పాటు అందించాలని అభిప్రాయపడ్డారు. ఉత్తమ రైతులకు పురసారాలు, సిబ్బంది, శాస్త్రవేత్తలకు అవార్డులు అందజేశారు. అగ్రికల్చర్ డిప్లొమాలో శ్రీలక్ష్మికి డాక్టర్ ఆలపాటి అప్పారావు పేరిట బంగారు పతకం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, వర్సిటీల వీసీలు రాజిరెడ్డి, జ్ఞానప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.