వికారాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అధికారం చేపట్టింది మొదలు బడుగుల భూములను బలవంతంగా గుంజుకుంటున్నది. అభివృద్ధి పేరుతో రైతుల జీవితాలపై దెబ్బకొడుతున్నది. పోరాటాలు చేసినా, ఎదురుతిరిగినా అణచివేస్తున్నది. ఇందుకు లగచర్ల ఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోని లగచర్ల రైతులు ఫార్మాకంపెనీల ఏర్పాటుకు భూములిచ్చేది లేదని దాదాపు ఏడాది పాటు ఉద్యమించినా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పోలీసులతో బెదిరించి కేసులు నమోదు చేసి, రైతులను జైలుకు పంపి భూములు లా క్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సీఎం సొంత నియోజకవర్గానికి సాగునీరందించేందుకు చేపట్టిన కొడంగల్-నారాయణపేట్ ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఎలాంటి అడ్డంకులు రా కుండా కొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది.
లగచర్ల తరహాలో ఎలాంటి అడ్డంకుల్లేకుం డా ముందుగానే గొంతులను అణచివేయాల ని ప్రభుత్వం నిర్ణయించింది. పరిగి మండలం కాళ్లపూర్, రాపోల్ గ్రామాల పరిధిలో 1197 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు, రేడియల్ రోడ్డు నిర్మాణం కోసం దోమ మండలంలోని మూడు గ్రామాల్లో 830 ఎకరాల భూ సేకరణ చేపడుతున్నది. రైతులు అడ్డుకోకుం డా, ధర్నాలు చేయకుండా పోలీస్ యాక్ట్‌ను అమల్లోకి తీసుకువచ్చింది. భూ సేకరణకు వ్యతిరేకంగా ప్రజలు, ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నాయకులెవరూ ఆడ్డురాకుండా దీనిని అమలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతోపాటు వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూర్ నియోజకవర్గాలను పక్కన బెట్టి కేవలం సొంత నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గానికి సాగునీరందించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్-నారాయణపేట్ ఎత్తిపోతల ప్రాజెక్టును తీసుకువచ్చారు. ప్రాజెక్టు నిర్మాణం, కాల్వల తవ్వకానికి 95 శాతం పట్టా భూములను సేకరించాల్సి ఉన్నదని అధికారులు చెప్తున్నారు. పట్టా భూములిచ్చేందుకు రైతులు ఎక్కువ నష్టపరిహారం డిమాండ్ చేస్తున్నారు. దీనికితోడు ధర్నాలు చేస్తారని గుర్తించిన ప్రభుత్వం పోలీస్ యాక్ట్‌ను అమల్లోకి తెచ్చిందని ఆరోపిస్తున్నారు. దీనిని అడ్డం పెట్టి భూములను గుంజుకునేందుకు ప్లాన్ చేసిందని చెప్తున్నారు.
పట్టా భూముల సేకరణలో భాగంగా ఎకరాకు రూ.20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎన్నో ఏండ్లుగా జీవనాధారంగా నమ్ముకున్న భూములను లాక్కొంటే రోడ్డున పడుతామని, తమకు బతుకుదెరువు చూపిన తర్వాతే భూసేకరణ చేపట్టాలని కొడంగల్ రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎకరానికి రూ.50లక్షలిస్తేనే భూములిస్త్తామని తెగేసి చెప్తున్నారు. ఎక్కువగా దౌల్తాబాద్ మండలంలోని నీటూరు, మాటూర్, గోకఫస్లబాద్, సుల్తాన్పూర్, దౌల్తాబాద్ గ్రామాల రై తులు భూములను కోల్పోతున్నారు. జిల్లాలో 1,400 ఎకరాల వరకు భూసేకరణకు నిర్ణయించగా, 400 ఎకరాలకు నోటిఫికేషన్ జారీచేసి, గ్రామసభలు నిర్వహించారు.
జిల్లాలోని పరిగి మండలంలోని కాళ్లపూర్, రాపోల్ గ్రామాల పరిధిలోని 1,197 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే కాళ్లపూర్లోని 428 ఎకరాల అసైన్డ్ భూములను సేకరించేందుకు ప్రభు త్వం నోటిఫికేషన్ జారీచేసింది. అనంతరం నిర్వహించిన గ్రామసభలను రైతులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. అంతేకాకుండా భూసేకరణలో భాగంగా పట్టా భూములను కూడా సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేయగా, కాళ్లపూర్, రాపోల్ గ్రామాల రైతులు భూములిచ్చేది లేదని తెగేసి చెప్పారు. అంతేకాకుండా రైతులు ఆమరణ నిరాహార దీక్షకు దిగడంతో గత్యంతరం లేక తాత్కాలికంగా భూ సేకరణను నిలిపివేసింది.
కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా మాకున్న కొద్దిపాటి పొలం కోల్పోతున్నాము. ఎకరానికి రూ.20 లక్షలు ఇస్తామని ప్రభుత్వం చెప్తున్నది. ఇది మాకు సరిపోదు. మాకు జీవనాధారమైన ఈ పొలం కోల్పోతే వేరే దిక్కే లేదు. మా భూమిని రూ.కోటికి అడిగినా అమ్మలేదు. ఇప్పుడు ప్రాజెక్టు నిర్మించేందుకు తీసుకుంటామంటే రూ.80-90 లక్షల వరకు నష్టపరిహారం ఇస్తేనే భూములిస్తాం. అంతేకాకుండా మా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి.
– ఎండీ అంజాద్ ఖాన్, పాలమద్ది, కొడంగల్ మండలం
నాకు ముగ్గురు ఆడబిడ్డలున్నారు. మా పొలాల నుంచి కాలువలు పోతున్నాయి, 25 గుంటల భూమిని కోల్పోతున్నాము. గుంటకు రూ.1.50 లక్షల నష్టపరిహారం ఇస్తే భూములిస్తాము. ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలి. మాకు బతుకుదెరువు చూపిస్తేనే భూములిస్తాం లేదంటే బైపాస్ దగ్గర ప్రభుత్వ భూముల గుండా కాలువలను తీసుకెళ్లండి.
– చింతకాయల బసయ్య, రైతు, పాలమద్ది