కరీంనగర్ తెలంగాణచౌక్, జూలై 11 : బ్రాహ్మణుల అభివృద్ధి కోసం రూ.వంద కోట్లు కేటాయించాలని భారతీయ బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రీరాంభట్ల దీపక్ బాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం కరీంనగర్లో ముఖ్యనాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ప్రతీ దేవాలయాన్ని దీప ధూప నైవేద్య పథకంలోకి తీసుకురావాలని కోరారు. బ్రాహ్మణ పరిషత్‌ను కార్పొరేషన్‌గా మార్చి, రూ.వంద కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దేవాలయ భూముల రక్షణ కోసం ప్రత్యేక కమిటీ వేయాలని, అందులో బ్రాహ్మణులకు అవకాశం కల్పించాలని సూచించారు. కోట్లాది రూపాయల విలువైన దేవాలయాల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, త్వర లో తమ కమిటీ ఆధ్వర్యంలో దేవాలయాలను సందర్శించి భూముల వివరాలను సేకరిస్తామని తెలిపారు.
‘సీపీఎస్’ జన జాగరణ యాత్ర ప్రారంభం ; పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్
భద్రాచలం, జూలై 11 : కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి, పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎస్ జన జాగరణ యాత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం నుంచి శనివారం ప్రారంభమైంది. నాయకులు, ఉద్యోగులు పోస్టర్లు పట్టుకొని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ యాత్రను సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ ప్రారంభించి, మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి మళ్లీ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించిన విషయాన్ని గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. భద్రాచలంలో ప్రారంభమైన ఈ యాత్ర రాష్ట్రంలోని 33 జిల్లాల మీదుగా కొనసాగుతుందని చెప్పారు. అనంతరం ఉద్యోగులంతా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు స మస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు.