న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు సంబంధించిన నియోజకవర్గాల పునర్విభజనలో పెద్దదైనా, చిన్నదైనా, ఉత్తరాది అయినా దక్షిణాది అయినా, తూర్పు అయినా పడమర అయినా ఏ రాష్ట్రం పట్ల వివక్ష ఉండదని ప్రధాని మోదీ గురువారం స్పష్టం చేశారు. ఈ సంస్కరణను వ్యతిరేకించే వారిని దేశంలోని మహిళలు క్షమించబోరని ఆయన హెచ్చరించారు. మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ, డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు కోసం ప్రవేశపెట్టిన మూడు బిల్లులపై లోక్సభలో జరుగుతున్న చర్చలో పాల్గొన్న ప్రధాని.. డీలిమిటేషన్ ప్రక్రియ ఫలితంగా ఏ రూపంలోనూ లోక్సభ సీట్ల నిష్పత్తి తగ్గదని స్పష్టం చేశారు.
ఆ క్రెడిట్ మీకే ఇస్తాం
2029లో మహిళా రిజర్వేషన్ల చట్టం అమలుకు తాము ఘనతను కోరుకోవడం లేదని, ఆ ఘనతను ప్రతిపక్షానికే ఇస్తామని మోదీ అన్నారు. మీరు వ్యతిరేకిస్తే నాకు రాజకీయ లబ్ధి చేకూరడం సహజం. కాని మీరు నాతోపాటే నడిస్తే ఎవరికీ ఎలాంటి రాజకీయ ప్రయోజనం చేకూరదు అని ఆయన అన్నారు. ఈ దేశ మహిళలకు తామే ఏదో అందచేస్తున్నామన్న భ్రమలో ఎవరూ ఉండకూడదని, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ అది వారి హక్కని ప్రధాని చెప్పారు. మాకు ఎటువంటి ఘనత వద్దు. మీరు నన్ను గ్యారెంటీ(హామీ) అనే పదం వాడమంటే నేను గ్యారెంటీ అనే పదం వాడతాను. మీరు నన్ను ప్రామిస్(వాగ్దానం) చేయమంటే నేను ప్రామిస్ అనే పదం వాడతాను. ఎందుకంటే ఉద్దేశం స్పష్టంగా ఉంటే మాటలతో ఆటలు ఆడాల్సిన అవసరం లేదు అని మోదీ స్పష్టం చేశారు.
వ్యతిరేకులు పర్యవసానాలు చూశారు
గతంలో మహిళలకు ఈ హక్కు ఇవ్వడాన్ని వ్యతిరేకించిన వారిని ఈ దేశ మహిళలు క్షమించలేదని, వారు పర్యవసానాలను ఎదుర్కొన్నారని మోదీ అన్నారు. దీన్ని రాజకీయ త్రాసులో తూచవద్దని, ఇది జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన నిర్ణయమని ప్రధాని అన్నారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలు మనల్ని చూస్తున్నారు. మన నిర్ణయాలను చూస్తారు. కానీ నిర్ణయం కంటే ఎక్కువగా వారు మన ఉద్దేశాన్ని విశ్లేషిస్తారు. మన ఉద్దేశంలో ఏ మాత్రం లోపం ఉన్నా ఈ దేశ మహిళలు ఎప్పటికీ క్షమించరు అని ఆయన చెప్పారు.
అప్పుడు సమయం లేదు
2023లో పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ల చట్టంపై చర్చిస్తున్నపుడు త్వరపడండి అని ప్రజలు అన్నారని మోదీ చెప్పారు. కానీ అది 2024లో(ఎన్నికలు) జరగలేదు. ఎందుకంటే అంత తక్కువ సమయంలో దీన్ని పూర్తి చేయడం సాధ్యం కాదు. ఇప్పుడు 2029 వరకు మనకు సమయం ఉంది. ఒకవేళ 2029లో కూడా దీన్ని అమలు చేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదన్నదే ప్రస్తుత అవసరం అని ఆయన చెప్పారు.