ప్రపంచంలో ఏ అధినేత చేయని విధంగా మోదీ ప్రవర్తించారు. తన తెలివి తక్కువ తనంతో అమెరికా ఎన్నికల్లో తలదూర్చారు. ‘అబ్ కీ బార్.. ట్రంప్ సర్కార్’ అంటూ ట్రంప్‌నకు మద్దతిస్తూ ప్రచారాన్ని ఊదరగొట్టారు. చివరకు ఏమైంది? 2019 ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయారు. అవేమైనా అహ్మదాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు అనుకొన్నారా? మోదీ చేసిన పనికి ఇప్పుడు భారత్ ఎటు పోవాలి? మోదీ చేష్టలతో అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రతిష్ఠ దిగజారింది. దీనికి దేశ ప్రజలకు మోదీ క్షమాపణలు చెప్పాల్సిందే.
– 02.07.2022 నాడు అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ గడ్డ సాక్షిగా చేసిన వ్యాఖ్యలివి
విదేశీ దౌత్యం విషయంలో ఆచితూచి ఎలా వ్యవహరించాలో.. అందునా అమెరికా వంటి అగ్రరాజ్యంతో ఎలా మసులుకోవాలో మాజీ సీఎం కేసీఆర్ అప్పుడే విడమరిచి చెప్పారు. విదేశీ దౌత్య విధానంలో ప్రధానమంత్రి మోదీ చేస్తున్న పొరపాట్లను పూసగుచ్చినట్టు ఎత్తిచూపారు. అయినప్పటికీ, ప్రధాని మారలేదు. ఫలితం ఇప్పుడు మనమందరం కండ్లతో చూస్తూనే ఉన్నాం. ‘హౌడీ మోదీ’, ‘నమస్తే ట్రంప్’ అంటూ 2019కి ముందు ట్రంప్‌తో చెట్టాపట్టాలు వేసుకొని తిరిగిన ప్రధానమంత్రి మోదీ.. కాలుకి బలపం కట్టుకొని తిరిగిమరీ ట్రంప్‌నకు మద్దతుగా ప్రచారం చేశారు. అయితే, అప్పటి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమిపాలై బైడెన్ గద్దెనెక్కారు. దీంతో ట్రంప్‌ను పక్కనబెట్టిన మోదీ బైడెన్‌కు దగ్గరయ్యారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్యంగా ట్రంప్ గెలిచి మళ్లీ పదవి చేపట్టారు. మోదీ ద్వంద్వ వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్న ట్రంప్.. అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత అక్రమ వలసలు, సుంకాల పేరిట భారత్‌పై ఆంక్షల కొరడా ఝుళిపించారు. అయితే, దౌత్యంతో ఈ సమస్యను పరిష్కరించాల్సిన కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం.. అలా చేయలేదు. అమెరికాకు వైరి పక్షాలుగా ఉన్న రష్యా, చైనాతో సాన్నిహిత్యాన్ని పెంచుకొని అగ్రరాజ్యాన్ని మరింత రెచ్చగొట్టింది. దీంతో అప్పటికే ఇండియా-యూఎస్ మధ్య సున్నితంగా ఉన్న రాజకీయ, ఆర్థిక, రక్షణపరమైన దౌత్య సంబంధాలు మరింత దిగజారాయి. ఈ క్రమంలోనే భారత ఉద్యోగులే లక్ష్యంగా హెచ్-1బీ వీసా రుసుమును లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్ పిడుగు వేశారు. అమెరికా తాజా నిర్ణయంతో భారతీయులు అందునా, తెలుగు రాష్ర్టాల్లోని వారిపైనే ఎక్కువ ప్రభావం పడనున్నది.
అమెరికాతో విదేశీ దౌత్యంలోనే కాదు.. స్వదేశీ పరిశ్రమలు కుంటుపడటానికి కూడా మోదీనే ప్రధాన కారణంగా నిలిచారు. దాదాపు 12 ఏండ్ల కిందట ప్రధానిగా పగ్గాలు చేపట్టిన మోదీకి.. ట్రంప్ సుంకాలతో హఠాత్తుగా ‘స్వదేశీ’ నినాదం గుర్తొచ్చింది. నిజానికి మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ పథకాలకు తూట్లు పొడిచింది కూడా మోదీ ప్రభుత్వమే. అందుకే, మోదీ ప్రభుత్వ హయాంలో 7 లక్షల కంపెనీలు మూతబడ్డాయి. మోదీ ఓటు బ్యాంకు రాజకీయాలు కూడా స్వదేశీ పరిశ్రమలను, ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు రాకుండా చేశాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కక్షపూరిత నిర్ణయాలతో అన్నిరకాల మౌలిక వసతులు కలిగిన తెలంగాణకు ఐటీఐఆర్ దూరమైంది. హైదరాబాద్-బెంగళూరు మార్గంలో రక్షణ కారిడార్ ప్రతిపాదనకూ మోకాలడ్డిన మోదీ ప్రభుత్వం.. బీజేపీపాలిత యూపీలోని బుందేల్‌ఖండ్‌కు దాన్ని తరలించింది. ఎకో సిస్టమ్ సరిగ్గాలేని అక్కడ కారిడార్‌ను ఏర్పాటు చేయడంపై పారిశ్రామిక నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇక, బీజేపీపాలిత రాష్ర్టాలపై మోదీ చూపిన పక్షపాతంతో శాంసంగ్ వంటి కంపెనీలు ఇండియాలో సెంటర్లను తెరువడానికే వెనుకాముందు ఆలోచించాయి. చైనా, దక్షిణ కొరియా, ఫిలిఫ్పీన్స్ దేశాల్లాగా సాంకేతికతలో స్వావలంబన సాధించడంలో వెనుకబడ్డారు. అగ్రరాజ్యంపైనే పూర్తిగా ఆధారపడే విధానాలను అవలంభించారు. అలా మొత్తంగా మోదీ ప్రభుత్వ విధానాలతో అటు విదేశాల్లోనూ.. ఇటూ స్వదేశంలోనూ భారతీయులకు ఉద్యోగాలు మృగ్యమయ్యే దుస్థితి దాపురించింది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): సుంకాలు, అక్రమ వలసల పేరిట ఇప్పటికే భారత్‌పై కఠిన అంక్షలను తెచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు హెచ్-1బీ వీసాల దరఖాస్తు రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు పెంచారు. తాజా నిర్ణయం భారతీయ టెకీలపై పెను ప్రభావం చూపుతుందని పారిశ్రామిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా హెచ్-1బీ వీసాతో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న తెలుగు రాష్ర్టాలకు చెందిన వారికి గడ్డు పరిస్థితులేనని చెప్తున్నారు. మోదీ ప్రభుత్వ దౌత్య వైఫల్యమే దీనికి కారణంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్, బైడెన్ విషయంలో మోదీ ద్వంద్వ వైఖరి, చైనా, రష్యాతో మరింత సాన్నిహిత్యమే కొంపముంచిందని విశ్లేషిస్తున్నారు.
అమెరికా దౌత్యంలో తొలి నుంచీ ప్రధాని మోదీ వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఓ దేశానికి ప్రధాని అన్న విషయాన్ని మరిచిపోయి.. 2019లో అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్‌నకు మోదీ ప్రచారం చేశారు. దీనిపై అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా వంటి అగ్రరాజ్యం ఎన్నికల విషయంలో జోక్యం మంచిది కాదని, అవేమైనా మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌లోని అహ్మదాబాద్ కార్పొరేషన్ ఎన్నికలా? అంటూ గట్టిగానే చురకలు అంటించారు. ‘ప్రపంచంలో ఏ అధినేత చేయని విధంగా మోదీ తన తెలివి తక్కువ తనంతో అమెరికా ఎన్నికల్లో తలదూర్చారు. ‘అబ్ కీ బార్.. ట్రంప్ సర్కార్’ అంటూ ట్రంప్‌నకు మద్దతిస్తూ ప్రచారాన్ని ఊదరగొట్టారు. చివరకు ఏమైంది? 2019 ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయారు. అవేమైనా అహ్మదాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు అనుకొన్నారా? మోదీ చేసిన పనికి ఇప్పుడు భారత్ ఎటు పోవాలి? మోదీ చేష్టలతో అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రతిష్ఠ దిగజారింది. దీనికి దేశ ప్రజలకు మోదీ క్షమాపణలు చెప్పాల్సిందే’ అని 2022లో నవంబర్ 2న జలవిహార్‌లో జరిగిన సభలో విమర్శించారు. అయినప్పటికీ, మోదీ వైఖరి మారలేదు.
2019 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలయ్యారు. దీంతో అప్పటివరకూ ఆప్త మిత్రుడిగా ప్రచారం చేసుకొన్న ట్రంప్‌ను పక్కనబెట్టిన మోదీ.. బైడెన్‌కు దగ్గరయ్యారు. ఇది ట్రంప్ పరీవారానికి రుచించలేదు. ఇదే సమయంలో స్వదేశీ పరిశ్రమలకు ఉతమిచ్చేలా అప్పటికే తీసుకొచ్చిన ‘మేకిన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ వంటి పథకాలను మోదీ సర్కారు గాలికొదిలేసింది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు లేకపోవడంతో మోదీహయాంలో గడిచిన 11 ఏండ్లలో 7 లక్షల కంపెనీలు మూతబడ్డాయి. స్వదేశంలో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో అమెరికా వంటి విదేశాలకు యువత క్యూకట్టింది. మోదీ వైఖరి విషయంలో అప్పటికే గుర్రుగా ఉన్న ట్రంప్.. రెండోసారి అధికారంలోకి రాగానే ‘అమెరికా ఫస్ట్’, ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ నినాదాల పేరిట భారత్ సహా విదేశాలపై సుంకాల పేరిట వాతను పెట్టారు. అక్రమ వలసల కట్టడి పేరిట వేలాదిమంది భారతీయులను గొలుసులతో కట్టి మరీ స్వదేశానికి పంపించి వేశారు. ఉక్రెయిన్‌తో ఏండ్లుగా యుద్ధం చేస్తున్న రష్యా చమురును కొనుగోలు చేస్తున్నారన్న సాకుతో భారత్‌పై సుంకాలను 50 శాతానికి పెంచారు. అయితే, ట్రంప్ సర్కారు ఆంక్షలను దౌత్య పరమైన విధానాలతో తగ్గించాల్సిన మోదీ ప్రభుత్వం.. గల్వాన్ ఘటనను మరిచిపోయి చైనాతో జట్టుకట్టింది. రష్యాతో మరింత సాన్నిహిత్యాన్ని పెంచుకొన్నది. బ్రిక్స్ సదస్సు అగ్గికి ఆజ్యంపోసినట్టు మారింది. ఈ క్రమంలోనే ట్రంప్ భారతీయ టెక్ నిపుణులకు కీలకమైన హెచ్-1బీ వీసాల రుసుమును ఏకంగా లక్షకు పెంచినట్టు విశ్లేషకులు చెప్తున్నారు.
దేశ జీడీపీలో సర్వీస్ సెక్టార్దే కీలకపాత్ర. ఇందులో ఐటీ, ఐటీఈఎస్, బీపీవో వంటి టెక్ సేవలదే అగ్రస్థానం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత ఐటీ ఎగుమతుల విలువ 200 బిలియన్ డాలర్లను దాటింది. రెమిటెన్స్ (విదేశాల్లోని భారతీయులు స్వదేశానికి పంపే మొత్తం) రూపంలో ఎక్కువ ద్రవ్యాన్ని అందుకొంటున్న దేశం కూడా భారతే. 2024లో రికార్డు స్థాయిలో 135.4 బిలియన్ డాలర్ల రెమిటెన్స్ వచ్చింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారింది. దేశంలోని రియల్ ఎస్టేట్, స్టార్టప్‌లలో పెట్టుబడులు, వ్యాపార కార్యకలాపాలకు దీన్నే చోదకశక్తిగా చెప్తారు. ఇప్పుడు ట్రంప్ తీసుకొన్న వీసా ఫీజు పెంపు నిర్ణయంతో దేశీయ టెక్ రంగంపై, ఉద్యోగులపై నీలినీడలు కమ్మాయి. ఇది అంతిమంగా జీడీపీ మీదనే ప్రభావం చూపే పరిస్థితులు దాపురించాయి.
మౌలిక వసతులు సరిగ్గా లేనప్పటికీ బీజేపీపాలిత రాష్ర్టాలకు కంపెనీలను కట్టబెట్టి, తెలంగాణ వంటి దక్షిణాది రాష్ర్టాలకు కేంద్రం మొండి చెయ్యి చూయించింది. 2013లో మంజూరు చేసిన ఐటీఐఆర్‌ను రద్దు చేసింది. దీంతో తెలంగాణకు రూ.2 లక్షల కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. అంతేకాదు.. ప్రత్యక్షంగా, పరోక్షంగా 70 లక్షల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారు. ఇక, హైదరాబాద్-బెంగళూరు మార్గంలో రక్షణ కారిడార్ ఏర్పాటు చేయాలని గతంలో అప్పటి సీఎం కేసీఆర్, మంత్రులు ఢిల్లీకి వెళ్లి అనేకమార్లు వినతులు చేసినా పక్కన పడేశారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో తెలంగాణకు ఉన్న అనుకూలతలను వివరించినా పెడచెవిన పెట్టారు. చివరికి మోదీ ప్రభుత్వం తాజాగా బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌కు డిఫెన్స్ కారిడార్‌ను మంజూరు చేసింది. ఇదే కారిడార్‌ను తెలంగాణకు మంజూరు చేస్తే ఇక్కడి ఎకోసిస్టమ్ ఆధారంగా అంతకన్నా రెట్టింపు ఫలితం కనిపించేదని పారిశ్రామిక నిపుణులు చెప్తున్నారు. యూపీఏ ప్రభుత్వం హయాంలో హైదరాబాద్‌కు నేషనల్ డిజైన్ సెంటర్ (ఎన్డీసీ) మంజూరయ్యింది. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎన్డీసీని ఏపీకి తరలించారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు కూడా నేషనల్ డిజైన్ సెంటర్‌ను (ఎన్డీసీ) మంజూరు చేయాలని 11 ఏండ్లుగా కోరుతున్నా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వస్త్ర పరిశ్రమకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న వనరులు, ఎన్డీసీ ఏర్పాటు ఆవశ్యకతను కేసీఆర్ ప్రభుత్వం అనేకసార్లు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినా పెడచెవిన పెట్టింది. మోదీ ప్రభుత్వ ఓటు బ్యాంకు రాజకీయాలతో స్వదేశీ పరిశ్రమలు, వనరులు, ఉపాధి అవకాశాలు పనికిరాకుండా మారాయి.
అగ్రరాజ్యం ఏటా జారీ చేసే హెచ్-1బీ వీసాల్లో 72 శాతం వాటా భారతీయులదే. ఇందులో జారీ అయ్యే ప్రతీ మూడు వీసాల్లో ఒక వీసా తెలుగు రాష్ర్టాలకు చెందిన టెక్ నిపుణులకే లభిస్తున్నదని గణాంకాలు చెప్తున్నాయి. ట్రంప్ తాజా వీసా నిర్ణయంతో భారతీయులను అక్కడి కంపెనీలు రిక్రూట్ చేసుకోవడం తగ్గిస్తాయని నిపుణులు అంటున్నారు. దీంతో ఆఫ్‌షోర్ ప్రాజెక్టులకు గండిపడొచ్చని చెప్తున్నారు.
నైపుణ్యం గల విదేశీ నిపుణులను నియమించుకోవడం కోసం తీసుకొచ్చిన నాన్-ఇమ్మిగ్రెండ్ వీసానే హెచ్-1బీ. ఈ రకం వీసాదారుల్లో ఇండియన్ ఉద్యోగులదే 72 శాతం వాటాగా ఉన్నది. అంటే, నైపుణ్యం కలిగిన ఇండియన్స్‌ను టెక్నాలజీ హబ్‌లుగా పిలిచే అమెరికన్ కంపెనీలు నియమించుకోవడానికి ఈ వీసాలు సాయపడేవి. ట్రంప్ తాజా నిర్ణయంతో ఈ టెక్నాలజీ-టాలెంట్ లింక్ తెగిపోయే ప్రమాదం ఏర్పడిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
హెచ్1-బీ వీసా నాన్-ఇమ్మిగ్రేంట్ వీసా. అంటే పరిమిత కాలంపాటు అమెరికాలో పనిచేసిన తర్వాత ఆ దేశాన్ని విడిచిపెట్టాల్సిందే. అయితే, ఈ విషయాన్ని లోతుగా అర్థంచేసుకోవడంలో అటు ప్రభుత్వాలు, ఇటు పౌరులు వెనుకబడటంతోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. అమెరికాలో శాశ్వత నివాసాన్ని కల్పించే గ్రీన్‌కార్డు కోసం ఈ వీసాను కొందరు వాడుకొంటున్నారని చెప్తున్నారు. దీన్ని అడ్డుకొనేందుకే ట్రంప్ తాజాగా ఫీజు పెంచారని వారంటున్నారు.
స్వావలంబన పేరిట ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘మేకిన్ ఇండియా’ వంటి పథకాలను తీసుకొచ్చిన మోదీ ప్రభుత్వం చేతల్లో మాత్రం అదేమీ చేయలేదు. అందుకే, సాంకేతిక, ఐటీ రంగంలో ఇప్పటికీ భారత్.. అమెరికా వంటి పాశ్చాత్య దేశాలమీదనే ఆధారపడాల్సి వస్తున్నది. అయితే, ప్రపంచీకరణ, మారుతున్న టెక్నాలజీ, అంతర్జాతీయ పరిణామాలను బేరీజు వేసుకొన్న చైనా, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్ తదితర దేశాలు కాలంతో మారుతూ సొంత సాంకేతికతను, వ్యవస్థలను ఏర్పాటు చేసుకొన్నాయి.
1998లో పోఖ్రాన్లో అణు పరీక్షలపై ఆగ్రహించిన అమెరికా భారత్‌పై కఠిన ఆంక్షలు విధించింది. ఈ క్రమంలో అప్పటి విదేశాంగ శాఖ మంత్రి జశ్వంత్‌సింగ్.. అమెరికాకు డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా వ్యవహరిస్తున్న స్ట్రోబ్ టాల్బోట్‌తో 11 దఫాల్లో చర్చలు జరిపారు. సున్నితంగా పరిస్థితులను వివరించారు. దీంతో ఈ అంశం కొంతకాలానికి సద్దుమణిగింది. అయితే, ట్రంప్ నిర్ణయాలపై మోదీ ప్రభుత్వం అలా వ్యవహరించలేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు.