హైదరాబాద్, సెప్టెంబర్ 20 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): హెచ్-1బీ వీసాల దరఖాస్తు రుసుమును లక్ష డాలర్లకు (రూ. 88 లక్షలు) పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొన్న నిర్ణయం అక్కడి భారతీయ టెకీల్లో కలవరానికి గురి చేస్తున్నది. కొత్త వీసాలతో పాటు, గడువు తీరే వీసాల పొడిగింపు విషయంలోనూ తాజా నిబంధనలు అమలు చేయడం అక్కడి వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. తాము సంపాదించే జీతమంతా వీసా రుసుముకే చెల్లించాల్సి వస్తుందని మధ్యస్థంగా వేతనాలు తీసుకొనే పలువురు టెకీలు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
‘నేను ఓ టెక్ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్‌ను. మూడేండ్లుగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నా. నా హెచ్-1బీ వీసాను కంపెనీనే స్పాన్సర్ చేసింది. అయితే, ఇప్పుడు దాని కాలపరిమితి తీరనున్నది. ట్రంప్ తాజా నిర్ణయం ప్రకారం వీసాను పొడిగించుకోవాలంటే, లక్ష డాలర్లు అంటే రూ.88 లక్షలు చెల్లించాలి. ఇంత మొత్తంలో కంపెనీ భరిస్తుందన్న ఆశ నాకు లేదు. నాకు ఏడాదికి లక్ష డాలర్ల జీతం. ఇప్పుడు వీసా కావాలంటే నా జీతం మొత్తాన్ని ఫీజుగా చెల్లించాల్సిందే. ఏం చేయాలో అర్థం కావట్లేదు’ అంటూ ఓ భారతీయ టెకీ సోషల్ మీడియాలో తన ఆవేదనను వ్యక్తం చేశారు.