Fee Reimbursement | హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఒక కాలేజీకి రావాల్సినవి రూ.1.68 లక్షలు.. మరో కాలేజీవి రూ.79 లక్షలు.. ఇంకో కాలేజీవి రూ.44 లక్షలు. ఇలా లక్షల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఇచ్చేందుకు కాంగ్రెస్ సర్కారు తిరస్కరించింది. ఇలా దాదాపు రూ.2000 కోట్ల బకాయిలను తిరస్కరించింది. దీంతో కాలేజీల యాజమాన్యాలు లబోదిబోమంటున్నాయి. పాత బకాయిలను ఇవ్వబోమని తేల్చిచెప్పింది. వాస్తవానికి ఇవేం కాలేజీలకు ఉచితంగా ఇచ్చేవేం కావు. రాయితీలు అంతకన్నా కావు. విద్యార్థులకు చదువు చెప్పినందుకు కాలేజీలు, విద్యాసంస్థలకు ప్రభుత్వం న్యాయంగా చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు. కానీ పాత ప్రభుత్వానికి చెందిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలన్న ఒకే ఒక్క కారణంగా కాంగ్రెస్ సర్కారు నిర్దాక్షిణ్యంగా తిరస్కరించింది. సర్కారు వ్యవహారం పట్ల కాలేజీ యాజమాన్యాలు ఫైర్ అవుతున్నాయి. టోకెన్లు కూడా విడుదలైన రూ.3,543 కోట్ల బకాయిల వివరాలను వెల్లడించకుండా, కేవలం రూ.1,207 కోట్లే బకాయిలున్నట్టు బుకాయించిన సర్కారు, తాజాగా పాత బకాయిలను ఇవ్వబోమంటూ తిరస్కరించడం పట్ల యాజమాన్యాలు మండిపడుతున్నాయి
ఫీజు రీయింబర్స్ బకాయిల విడుదల కోసం రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్స్ ఇన్స్టిట్యూషన్స్ (ఫతి)గా ఏర్పడ్డాయి. ఈ నెల 15 నుంచి కాలేజీల నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో సర్కారు మూడు దఫాలుగా ఫతి ప్రతినిధులతో చర్చలు జరిపింది. చర్చల సమయంలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి యాజమాన్యాలకు సంకేతాలిచ్చారు. పాత బకాయిలను ఇవ్వము గాక ఇవ్వమని యాజమాన్యాలకు స్పష్టంచేశారు. తాము అధికారం చేపట్టిన 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాలే ఇస్తామని చెప్పారు. అయితే యాజమాన్యాలు ఈ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. పైకి అలా చెప్తున్నా ప్రభుత్వమన్నాక అన్నింటినీ ఇవ్వాల్సి ఉంటుందని ఊహించాయి. కానీ ఇందుకు పూర్తిభిన్నంగా సర్కారు వ్యవహరించింది. గత బీఆర్ఎస్ హయాంలో జారీ అయిన టోకెన్లను తిరస్కరించింది. తాము అధికారంలోకి వచ్చాక ఏర్పడిన బకాయిలను మాత్రమే చెల్లించేందుకు సిద్ధమైంది. ఈ విషయం తెలుసుకుని కాలేజీల యాజమాన్యాలు బోరుమంటున్నాయి. తాము ఫతిగా ఏర్పడి, నిరవధిక బంద్‌కు పిలుపునివ్వడాన్ని జీర్ణించుకోలేకే ప్రభుత్వం తమను వేధిస్తున్నదని, ఇవి కక్ష సాధింపు చర్యలేనని మండిపడుతున్నాయి.
గతంలో ఏ ఒక్క సంవత్సరంలో కాంగ్రెస్ సర్కార్లు వందకు వందశాతం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించిన దాఖలాల్లేవు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉమ్మడి రాష్ట్రంలోను ఈ బకాయిలు పేరుకుపోయాయి. నాలుగేండ్ల బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించకపోవడంతో రూ.1,880 కోట్ల బకాయిలను కేసీఆర్ సర్కారు వారసత్వంగా అందుకున్నది. ఈ బకాయిలను కేసీఆర్ ప్రభుత్వం ఏ మాత్రం భేషజాలకు పోకుండా చెల్లించింది. 2014 -17 వరకు కేసీఆర్ సర్కారు పాత బకాయిలు, అప్పటి బకాయిలను కలుపుకుని రూ.4,687.72 కోట్లను చెల్లించింది. ఉమ్మడి రాష్ట్రంలోని నిబంధనలను యధాతథంగా కొనసాగించింది. పాత బకాయిలు వారసత్వంగా వచ్చాయని, వాటిని చెల్లించబోమనడం దారుణమని కాలేజీల యాజమాన్యాలంటున్నాయి. 2017లో అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఎమ్మెల్యేగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ‘ఏ పార్టీ అధికారంలో ఉన్నామన్నది ముఖ్యం కాదు. ప్రభుత్వమన్నాక నిరంతర ప్రక్రియ. ఒక ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన వాటిని మరో ప్రభుత్వం కొనసాగించాలి, బకాయిలను చెల్లించాలి’ అని చెప్పారు. మళ్లీ ఇప్పుడు అదే కాంగ్రెస్ సర్కారు పాత బకాయిలతో తమకేం సంబంధం. మేమేందుకు చెల్లించాలంటూ మొండికేసింది. ఏకంగా బకాయిలను చెల్లించకుండా తిరస్కరించింది.