Sardar Patel – Modi | ఇద్దరు గుజరాతీలు! ఇద్దరూ గుజరాతీలేనా? కాదు, కానే కాదు! పుట్టుక బట్టి వ్యక్తిత్వం ఉండదనీ, గుర్తింపు ఉండకూడదనీ సాక్షాత్తూ శ్రీకృష్ణుడే చెప్పాడు: ‘చాతుర్వర్ణం మయాసృష్టం గుణకర్మ విభాగశః’ అని (భగవద్గీత విభాగ 4 శ్లోకం 13) అంటే మనిషి, మనిషికి వేరుగా ఉండే వర్ణాలని-అంటే ప్రవృత్తిని బట్టి – తను సృష్టించానన్నాడు. గుజరాత్లో పుట్టినవాళ్లందరూ ఒకేలా ఉండరూ, వారి వారి పూర్వజన్మ సంస్కారాలను బట్టి ఈ జన్మ గుణాలుంటాయీ అని అర్థం! ఇక ఇద్దరు గుజరాత్లో పుట్టినవారికి లేశమైనా పోలికలున్నాయేమో పరిశీలిద్దాం!
ఒకసారి నెహ్రూ, సాక్షాత్తూ ప్రధానమంత్రి, ఆల్ ఇండియా రేడియోలో మాట్లాడుతూ, అనవసరమైనవీ, వివాదాస్పదమైన విషయాలు వివరిస్తుంటే ఆయన భాషణను ఆపించిన ఘనుడు ఒక గుజరాతీ: ఏ విపక్ష పాలిత రాష్ర్టానికి వచ్చినా అబద్ధాలు నిండిన వివాదాస్పద వ్యాఖ్యలు మాత్రమే భాషించే ఈ గుజరాతీ ఎక్కడ? ఈ ఇద్దరు గుజరాతీలకు ఏమైనా పోలిక ఉందా?
ఒక గుజరాతీ దేశానికి స్వాతంత్య్రం వచ్చాక మొట్టమొదటి హోంమంత్రి. అంటే కేంద్రమంత్రి వర్గంలో రెండవస్థానం. ఇంకొకరు ఆ తర్వాత అరవై ఏడేండ్లకు కేంద్రంలో ప్రథమస్థానం వహించిన ప్రధానమంత్రి! ఒకరు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని దేశ ఉన్నతి కోసం పరితపించిన వ్యక్తి; ఇంకొకరు దేశంలో పెచ్చు పెరిగిన స్వార్థ రాజకీయాల్లో ఎదిగి దేశం ద్వారా తాను ఏమి లబ్ధి పొందవచ్చునన్న ఆలోచనలు చేసిన మనిషి. ముక్కలు చెక్కలుగా ఉన్న దేశాన్ని ఏకంజేసి జాతీయతను పెంపొందించాలని ధైర్యంతో, స్థయిర్యంతో, మేధా ప్రజ్ఞలతో, ఏక దీక్షతో ఆ ఆశయాన్ని సాధించిన ఉక్కు మనిషి. ‘దేశంలో ఉన్నవారందరూ దేశానికే చెందుతారు.
మనిషి ఎక్కడుంటే ఆ దేశానికే వారు త్రికరణ శుద్ధిగా పనిచేయాలని’ ప్రకటించిన ధీరుడు. ఇంకొకరు 75 ఏండ్లుగా ఏకంగా ఉన్న మనుష్యులను విడదీసి, కొందరిని పరాయివాళ్లుగా ప్రకటించి వారి బతుకులు దుర్భరం చేయటానికి తనశక్తి, అధికారం ఉపయోగిస్తున్న పిరికి పంద! ఒకరిది దేశ ప్రగతి కోసం దీర్ఘ దృష్టి; ఇంకొకరిది స్వార్థ రాజకీయాలతో హ్రస్వదృష్టి! ఒకరు విపక్షాలను ఎదుర్కొని పాలించగలిగిన సాహసవంతుడు, తెలివిమంతుడు; ఇంకొకరు విపక్షాలను తప్పుడు విధానాల ద్వారా, అన్యాయ మార్గాల ద్వారా, తన అధికార బలంతో అణచివేయాలని, నాశనం చేయాలనే దుష్టబుద్ధి, తెలివి తక్కువతనం ఉన్నవాడు. ఒకరు ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వాతంత్య్రం ఇస్తూనే క్రమశిక్షణతో ఉంచాలన్న విచక్షణ ఉన్న నాయకుడు; ఇంకొకరు ప్రజాస్వామ్య విలువలను కాలరాసి, ఇష్టం లేనివారికి ఏ స్వాతంత్య్రం, సంతోషం లేకుండా చేయాలని ప్రయత్నించే మూర్ఖుడు! ఒక్కరు న్యాయవాది, ఇంకొకరు అన్యాయవాది!
ఒకరు స్థితప్రజ్ఞుడు; ఇంకొకరు సంయమనం లోపించినవారు! ఒకసారి వల్లభాయ్ పటేల్ న్యాయస్థానంలో ఒక కేసు వాదిస్తుండగా ఒక టెలిగ్రామ్ వచ్చింది. ఆ రోజుల్లో టెలిగ్రామ్ చాలా ముఖ్యమైన విషయాలనే చేరవేసేది. అందుకని అసిస్టెంట్ దాన్ని అందుకని పటేల్‌కు అందించాడు. అది విప్పి చదువుకొని, మడిచి జేబులో పెట్టుకొని, తన వాదన సాగించాడు పటేల్. గంటకు తన వాదన ముగించుకొని, తను వెళ్లటానికి అనుమతి కోరాడు న్యాయాధీశుడిని. ‘అదేమిటి, అవతలివారి తరపు న్యాయవాది వాదనలు వినరా?’ అని అడిగిన ఆయనకు విషయం చెప్పాడు. ‘మిలార్డ్ నా భార్య చనిపోయిందని టెలిగ్రామ్ వచ్చింది. నేను వెడతాను’ ఆశ్చర్యచకితుడైన ఆ జడ్జి సారీ చెప్పి వెంటనే వెళ్లటానికి అనుమతించాడు పటేల్‌ను! అదీ స్థితప్రజ్ఞత అంటే! రాగద్వేషాలు లేకుండా బాధ్యతాయుతంగా జీవించటమంటే! ఇంకొకరు కేవలం రాగద్వేషాల పల్లకీలోనే ఊరేగుతూ, రాజకీయ మర్యాదలు పాటించకుండా రాష్ట్రపతిని కేంద్ర సంసద్ భవన ప్రారంభోత్సవ సంబురానికి ఆహ్వానించరు.
ఒక రాష్ర్టానికి వెళ్లి ఆ ముఖ్యమంత్రిని తనని కలవకూడదని ఆదేశిస్తారు, ఒకే ప్రమాణం పదేండ్ల పాటు ఆ పనిచేయకుండా వినిపిస్తారు. రాష్ర్టాల మధ్య న్యాయంగా చూపాల్సిన కనీస సమానత్వాన్ని, నిధుల విడుదలలో కనీస న్యాయాన్ని చూపరు. జరిగిన ప్రగతిని వక్రీకరించగలరు, లేక నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకోగలరు. నోరు విప్పితే అబద్ధాలు, అసత్యాలు; అన్యాయంగా ఇతర పక్షాల మీద నిందలు వేస్తారు. మరి ఇద్దరూ గుజరాతీలేనా? ఒకరు తను మానవుడిని అన్న భావంతో పరాయి పాలనలో మగ్గుతున్న సామాన్యుల కోసం స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న త్యాగధనుడైతే, ఇంకొకరు కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నత స్థానంలో ఉండి ఇంకా తన రాష్ట్రంలో ఒక మూల పనిచేస్తున్న సర్పంచిలాగా ప్రవర్తించేవారు. అరిషడ్వర్గాలలోని కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలని అణువణువూ నింపుకొన్నవారు. మరి ఆ జాతీయ నాయకుడైన గుజరాతీ ఎక్కడ? వ్యక్తిత్వం కుంచించుకుపోయిన ఈ గుజరాతీ ఎక్కడ?
అవసాన దశలో ఆక్సిజన్ టెంట్లో ఉండి, తన విభాగం పనులు ఆగకూడదని ఫైల్స్ తెప్పించుకొని ఊపిరి ఆగేదాకా ప్రజల కోసం పనిచేసిన ఆ గుజరాతీ ఎక్కడ? అనుయాయులకు దేశ సంపద కట్టబెట్టాలని 20 మంది కోసం 140 కోట్ల ప్రజలను పట్టించుకోని ఈ గుజరాతీ ఎక్కడ?
మరి గుజరాతీ అన్నదే గుర్తింపైతే, దేశాన్ని దాటి విశ్వమానవుడిగా ప్రపంచ దేశాల వారు ఆరాధించే ఇంకో గుజరాతీని మర్చిపోయారేం? విదేశీ అతిథులకు ఆయన సమాధి చూపించటమేనా లేక ఆయన ప్రవచించిన సమానత్వం, మానవీయత ఎప్పటికైనా అర్థం చేసుకుంటారా? అనుమానమే!
కనకదుర్గ దంటు
89772 43484