Tejpratap Yadav : ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) రాజకీయ కారణాలతో మాత్రమే బీహార్‌కు వస్తారని ఆర్జేడీ (RJD) బహిష్కృత నేత, ఆ పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్‌ప్రతాప్ యాదవ్ (Tejpratap Yadav) ఆరోపించారు. ఇప్పుడు బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడ్డాయని, అందుకే ఇక్కడి ప్రజలపై ప్రధాని వరాల వర్షం కురిపిస్తున్నారని విమర్శించారు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ప్రధాని ఇదేరకంగా బీహార్‌కు వచ్చారని, షుగర్ మిల్లును ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారని తేజ్‌ప్రతాప్ గుర్తుచేశారు. కానీ ఇప్పటికీ ఇక్కడ షుగర్ మిల్లు ప్రారంభం కాలేదని ఎద్దేవా చేశారు. ఎప్పుడూ అబద్దపు హామీలు ఇచ్చే ప్రధాని పర్యటన బీహార్ ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపబోదని అన్నారు.
ఈ పర్యటనలో ప్రధాని మోదీ విమానాశ్రయాలు, వంతెనలను ప్రారంభిస్తున్నారని, కానీ ఇక్కడ ఇప్పుడు ప్రధాన సమస్య వరద పరిస్థితి అని తేజ్‌ప్రతాప్ చెప్పారు. వరదల్లో జవానియా గ్రామం పూర్తిగా కొట్టుకుపోయిందని, అయినా ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదని విమర్శించారు. జవానియా ప్రజలు ఏడుస్తున్నారని, ప్రధాని అక్కడికి వెళ్లాలని కోరారు. రఘోపూర్‌లో కూడా పరిస్థితి అలాగే ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు.