PM Modi : యూఏఈలోని ఫ్యుజైరా ఆయిల్ హబ్‌పై ఇరాన్ దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఇరాన్ జరిపిన డ్రోన్ దాడుల్లో ముగ్గురు భారతీయులు గాయపడ్డారు. ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా దాడుల్ని ఖండిస్తూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
‘‘యూఏఈలోని ఫ్యుజైరా ఆయిల్ హబ్‌పై ఇరాన్ జరిపిన దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడుల్లో ముగ్గురు భారతీయులు గాయపడ్డారు. పౌరుల్ని, సాధారణ నిర్మాణాల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరపడం ఆమోదయోగ్యం కాదు. ఈ క్లిష్ట సమయంలో యూఏఈకి ఇండియా మద్దతుగా ఉంటుంది. ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యల్ని పరిష్కరించుకునేందుకు చర్చలు, దౌత్యపరమైన మార్గాలే ముఖ్యమని ఇండియా మరోసారి చెబుతోంది. ఈ ప్రాంతంలో శాంతి ప్రక్రియ కోసం హార్ముజ్ నుంచి నిరాటంకమైన, సురక్షితమైన ప్రయాణం అవసరం. అప్పుడే ఇంధన భద్రత కోసం ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం సాధ్యమవుతాయి’’ అని మోదీ తన ట్వీట్లో పేర్కొన్నారు.
మరోవైపు ఈ దాడుల్ని ఖండిస్తూ అంతకుముందు భారత విదేశాంగ శాఖ కూడా ఒక ప్రకటన చేసింది. ఇలాంటి దాడులు సరికాదని పేర్కొంది. యూఏఈలోని ఆయిల్ హబ్‌పై ఇరాన్ దాడి చేయగా, ముగ్గురు భారతీయ కార్మికులకు గాయాలయ్యాయి. వారికి తగిన వైద్య సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని అక్కడి భారతీయ రాయబార కార్యాలయ అధికారులు ప్రకటించారు. ఒకపక్క కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ ఇరాన్ ఈ దాడి చేయడం విశేషం.