Christopher Nolan | హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ది ఒడిస్సీ’కి సంబంధించిన కొత్త ట్రైలర్ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. యూనివర్సల్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 17న థియేటర్లలోకి రాబోతున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ట్రైలర్ను విడుదల చేయగా.. ట్రైలర్లో గ్రీకు వీరుడు ఒడిస్సియస్, ట్రోజన్ యుద్ధం ముగిసిన తర్వాత తన భార్య మరియు కొడుకును రక్షించుకోవడానికి రాజ్యమైన ఇథాకాకు తిరిగి వచ్చే క్రమంలో ఎదుర్కొనే సుదీర్ఘమైన, ప్రమాదకరమైన ప్రయాణామే ఈ సినిమా కథ. ఇందులో ఒడిస్సియస్గా మ్యాట్ డామన్ నటిస్తుండగా, అతని కుమారుడు టెలిమాకస్గా టామ్ హాలండ్, భార్య పెనెలోప్ పాత్రలో అన్నే హాత్వే కనిపించనున్నారు. అలాగే నింఫ్ కాలిప్సోగా చార్లీజ్ థెరాన్, పెనెలోప్ను వివాహం చేసుకుని రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని చూసే విలన్ ఆంటినస్ పాత్రలో రాబర్ట్ ప్యాటిన్సన్ నటిస్తున్నారు. హోమర్ రాసిన పురాణ గాథ ‘ది ఒడిస్సీ’ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో సైక్లోప్స్(Mythical Cyclops) వంటి పూరణ జీవులను నోలన్ తనదైన శైలిలో అద్భుతంగా చూపించబోతున్నట్లు తెలుస్తుంది. పూర్తిస్థాయి ఐమాక్స్ (IMAX) కెమెరాలతో చిత్రీకరించిన ఈ సినిమాలోని యుద్ధ సన్నివేశాలు వెండితెరపై ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. సుమారు 250 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్తో నిర్మితమవుతున్న ఈ చిత్రం నోలన్ కెరీర్లోనే అత్యంత ఖరీదైన సినిమాగా నిలవనుంది.