
ప్రతి అంతర్జాతీయ కంపెనీకి కేంద్రంగా మారుతున్న తెలంగాణకు మరో ప్రతిష్ఠాత్మక సంస్థ రానున్నది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఓపెన్ ఇన్నోవేషన్ ప్లాట్‌ఫామ్ ‘ప్లగ్ అండ్ ప్లే’ రాష్ట్రంలో తన కేంద్రాన్ని నెలకొల్పాలని నిర్ణయించింది. ఈ సంస్థకు మన దేశంలో ఇదే తొలి కేంద్రం. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు ప్లగ్ అండ్ ప్లే సంస్థ ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించారు. దాంతో హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటుచేయాలని సంస్థ వెంటనే నిర్ణయం తీసుకొన్నది. డిసెంబర్ మొదటివారంలో ఈ కేంద్రం ప్రారంభం కానున్నది. మరోవైపు పర్యావరణ అనుకూల నగరాల అభివృద్ధికి కలిసి పనిచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం, ఫ్రాన్స్‌కు చెందిన బోర్డియాక్స్ మెట్రోపోల్ సంస్థ శనివారం అవగాహన ఒప్పందం కుదుర్చుకొన్నాయి.
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే అతిపెద్ద సాంకేతిక పరిశోధన సంస్థ ‘ప్లగ్ అండ్ ప్లే’ హైదరాబాద్‌లో టెక్ సెంటర్‌ను ఏర్పాటుచేయనున్నది. మన దేశంలో ఈ సంస్థకు ఇదే తొలి కేంద్రం. అంతర్జాతీయంగా ఎంతో పేరున్న ఈ సంస్థను హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేలా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ఒప్పించారు. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న కేటీఆర్ శనివారం ప్లగ్ అండ్ ప్లే ప్రతినిధులతో ఆ దేశ సెనేట్‌లో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరం అంతర్జాతీయ బడా సంస్థలకు ఎలా కేంద్రంగా మారుతున్నదో కూలంకషంగా వివరించారు. దాంతో హైదరాబాద్‌లో టెక్ కేంద్రాన్ని ప్రారంభించాలని ఆ సంస్థ వెంటనే నిర్ణయం తీసుకొన్నది. వచ్చే డిసెంబర్ మొదటివారంలో మంత్రి కేటీఆర్, ప్లగ్ అండ్ పే వ్యవస్థాపక సీఈవో సయీద్ అమీది సమక్షంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్టు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ప్లగ్ అండ్ ప్లే సంస్థ యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా (ఈఎంఈఏ) ఎండీ ఒమీద్ మెహ్రీన్ఫార్, స్టార్టప్ ఆటోబాన్ ఎండీ సస్చా కారింపౌర్, ఆటోబాన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ హన్నా బూమ్గార్డెన్, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, ముఖ్య సంబంధాల అధికారి అమర్నాథ్రెడ్డి ఆత్మకూరు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఫ్రెంచ్ ప్రభుత్వం, బిజినెస్ ఫ్రాన్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘యాంబిషన్ ఇండియా’ సదస్సులో భాగంగా ఈ సమావేశం జరిగింది.
ప్రపంచ ప్రఖ్యాత ఇన్నోవేషన్ ప్లాట్‌ఫామ్
అతిపెద్ద ఎర్లీస్టేజ్ ఇన్నోవేటర్‌గా, ఆక్సిలరేటర్గా, ప్రఖ్యాత కార్పొరేట్ ఇన్నోవేషన్ ప్లాట్‌ఫామ్‌గా పేరొందిన ప్లగ్ అండ్ ప్లే సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 35,000 స్టార్టప్‌లు, 530కి పైగా ప్రపంచ అగ్రశ్రేణి కార్పొరేషన్లతో నెట్వర్క్ ఉన్నది. 1,500 యాక్టివ్ పోర్ట్‌ఫోలియోలతో 9 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సాధించింది. ఈ సంస్థకు అమెరికాలోని సిలికాన్ వ్యాలీ, జర్మనీలోని స్టట్గార్ట్ట్, ఫ్రాన్స్‌లోని పారిస్, జపాన్‌లోని ఒసాకా, చైనాలోని షాంఘై, స్పెయిన్‌లోని వాలెన్సియా, నెదర్లాండ్స్‌లోని ఆమ్స్టర్డామ్ సహా ప్రపంచవ్యాప్తంగా 37 కార్యాలయాలున్నాయి. 2020లో ప్లగ్ అండ్ ప్లే అమెరికాలో 585, ఈఎంఈఏలో 438, ఆసియాలో 1,042 కలిపి మొత్తం 2,056 స్టార్టప్‌లను వేగవంతం చేయడంతోపాటు 162 వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టింది. గూగుల్, పేపాల్, డ్రాప్‌బాక్స్, లెండింగ్ క్లబ్, ఎన్ 26, సౌండ్‌హౌండ్ హనీ, కుస్తోమర్, గార్డెంట్ హెల్త్ తదితర ప్రముఖ సంస్థలకు ప్రారంభ పెట్టుబడిదారుగా ఉన్న ప్లగ్ అండ్ ప్లే, మొబిలిటీ, ఐవోటీ, ఎనర్జీ, అగ్రిటెక్, హెల్త్, సస్టెయినబిలిటీ, ట్రావెల్, ఫిన్‌టెక్ తదితర రంగాలపై కూడా దృష్టి కేంద్రీకరించింది. హైదరాబాద్‌లో మొబిలిటీ, ఐవోటీ, ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర రంగాల్లో ఎకోసిస్టంను అభివృద్ధి చేయడంపై ప్లగ్ అండ్ ప్లే దృష్టి సారించనున్నది. తదుపరి దశలో ఫిన్‌టెక్, లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ రంగాలకు విస్తరించాలని నిర్ణయించింది. సీటెల్‌లోని వెంచర్ ఫౌండ్రీ ట్రయాంగులమ్ ల్యాబ్స్ ఐవోటీ, స్మార్ట్ సిటీల కోసం ఇంక్యుబేషన్‌ను అమలు చేసేందుకు హైదరాబాద్‌లోని ప్లగ్ అండ్ ప్లే టెక్ సెంటర్‌తో కలిసి పనిచేయనున్నది.
కేటీఆర్ ప్రోత్సాహంతోనే..
పెట్టుబడుల ఆకర్షణలో మంత్రి కేటీఆర్ చొరవను జర్మనీ స్టార్టప్ ఆటోబాన్ ఎండీ సస్చా కారింపౌర్ అభినందించారు. ఆయన అందించిన ప్రోత్సాహం, సహకారంతో ప్లగ్ అండ్ ప్లే భారతదేశంలో అత్యంత విజయవంతమైన సంయుక్త ప్లాట్‌ఫామ్‌ను నిర్మిస్తుందని తెలిపారు. నవీన సాంకేతిక సహకారానికి అంతర్జాతీయ కేంద్రంగా మారిన ఆటోబాన్ మాదిరిగా హైదరాబాద్‌లో ప్లగ్ అండ్ ప్లే టెక్ సెంటర్ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈఎంఈఏ ఎండీ, కో-హెడ్ ఒమీద్ మెహ్రీన్ఫార్ మాట్లాడుతూ.. తొలుత తాము హైదరాబాద్‌లో మొబిలిటీ, ఐవోటీ, ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలపై దృష్టి పెడతామని, తదుపరి దశలో ఫిన్‌టెక్, హెల్త్‌కేర్ రంగాలకు కార్యకలాపాలను విస్తరిస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రముఖ భారతీయ పరిశ్రమలతోపాటు 500కు పైగా కంపెనీలుగల పీఎన్పీ అంతర్జాతీయ నెట్వర్క్ సహకారం తీసుకొంటామని తెలిపారు.
అతిపెద్ద హబ్..
భారత్‌లో స్టార్టప్స్, కార్పొరేట్స్, ఇన్వెస్టర్లకు అత్యుత్తమమైన అతిపెద్ద హబ్‌ను ఏర్పాటుచేయాలని ప్లగ్ అండ్ ప్లే లక్ష్యంగా పెట్టుకున్నది. అంతర్జాతీయ అగ్రశ్రేణి కార్పొరేషన్ల భాగస్వామ్యంతో స్టార్టప్ కొలాబరేషన్ (స్కౌటింగ్, పీవోసీస్, ఇంప్లిమెంటేషన్స్)ను వేగవంతం చేయాలని నిర్ణయించింది. భారత స్టార్టప్‌లు ప్రపంచ అగ్రశ్రేణి స్టార్టప్‌లతో కలిసి పనిచేసేందుకు, పీఎన్పీ నెట్వర్క్ ద్వారా అంతర్జాతీయంగా విస్తరించేందుకు గేట్వేగా ఉపయోగపడాలని నిశ్చయించింది. వినూ త్న పరిష్కారాలను అభివృద్ధిచేయడంతోపాటు వాటిని అంతర్జాతీయంగా విస్తరించేందుకు ప్లగ్ అండ్ ప్లే ఓ వేదికగా ఉపయోగపడనున్నది. భారతీయ స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెట్టడంతోపాటు వాటిని అంతర్జాతీయ పెట్టుబడి సంస్థల నెట్వర్క్లోనికి తెచ్చేందుకు దోహదపడనున్నది.
ఫ్రాన్స్ పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు
మంత్రి కేటీఆర్ బృందం శనివారం ఫ్రాన్స్ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించింది. ఫ్రాన్స్‌లో రెండో అతిపెద్ద ఫార్మాస్యూటికల్ సంస్థ ‘సర్వియర్’ ప్రతినిధులు ఒలీవియర్ నోస్జీన్, పాట్రిక్ జెనిసెల్, బెర్నార్డ్ పరిన్ తదితరులతో సమావేశమై తెలంగాణలో ఉన్న పటిష్ఠమైన లైఫ్‌సైన్సెస్, ఫార్మా ఎకోసిస్టం గురించి వివరించారు. పరిశ్రమలను, విద్యాసంస్థలను అనుసంధానం చేసే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సరిల్ ఆఫ్ హైదరాబాద్ వంటి వినూత్న కార్యక్రమాల గురించి తెలిపారు. 2022 బయో ఏషియా సదస్సులో పాల్గొనాలని ఆహ్వానించారు. పరస్పర సహకారం కోసం వేదికలను తయారుచేయాలని కోరారు. అనంతరం ఫ్రెంచ్ బహుళజాతి ఎయిర్ క్రాఫ్ట్, రాకెట్ ఇంజిన్ల తయారీ సంస్థ సఫ్రాన్ సీఈవో జీన్ పాల్ అలారీతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు దోహదకారిగా ఉండేలా నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాలపై చర్చించారు. ఆ తర్వాత ఫ్రెంచ్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఆసియా అండ్ మిడిల్ ఈస్ట్) డైరెక్టర్ ఫిలిప్ ఓర్లియాంజ్తో మంత్రి కేటీఆర్ బృందం సమావేశమైంది.
థేల్స్ గ్రూపు ప్రతినిధులతో..
థేల్స్ గ్రూప్ ఈవీపీ మార్ డార్మన్, ఇండియా సీఈవో ఆశిష్ సరాఫ్‌తో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. కొత్త సాంకేతికతలతో తెలంగాణ సాధిస్తున్న విజయాలు, డబ్ల్యూఎఫ్ సహకారంతో ఇటీవల ప్రారంభించిన మెడిసిన్ ఫ్రమ్ సై ప్రాజెక్ట్ గురించి కేటీఆర్ వివరించారు. వందేండ్ల చరిత్ర ఉన్న థేల్స్ సంస్థ డిజిటల్ ఐడెంటిటీ అండ్ సెక్యూరిటీ, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ, ఏరోస్పేస్, స్పేస్ అండ్ ట్రాన్స్పోర్ట్ విభాగాల్లో సేవలందిస్తున్నది. ఈ సంస్థకు ఐదు ఖండాల్లో 80 వేల మందికి ఉద్యోగులున్నారు. అనంతరం కియోలిస్ సీఈవో బెర్నార్డ్ టాబరీతో కేటీఆర్ బృందం సమావేశమైంది. షేర్డ్ మొబిలిటీ రంగంలో ప్రపంచలోని అగ్రగణ్య సంస్థల్లో కియోలిస్ ఒకటి. కియోలిస్ గ్రూప్ అనుబంధ సంస్థ కియోలిస్ హైదరాబాద్.. హైదరాబాద్ మెట్రోకు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్‌లో భాగస్వామి. ఆటోమెటిక్ మెట్రో, ట్రామ్ వేలలో ప్రపంచ అగ్రగామిగా ఉన్న ఈ గ్రూప్, మెడికల్ ట్రాన్స్పోర్ట్, ఫ్రాన్స్‌లోని గ్లోబల్ పారింగ్ కాంట్రాక్ట్ లలో కూడా నంబర్ వన్‌గా ఉన్నది. ఐదు ఖండాల్లోని 16 దేశాల్లో ఈ సంస్థ విస్తరించింది.
ఎలక్ట్రిక్ ఎనర్జీ ఎంఎన్సీ ష్నైడర్ ప్రతినిధులతో..
ష్నైడర్ ఎలక్ట్రిక్ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ లూక్ రిమోంట్తో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఎలక్ట్రిక్ ఎనర్జీ, ఆటోమేషన్ డిజిటల్ సొల్యూషన్స్ అందించటంలో ష్నైడర్ దిగ్గజ సంస్థ. 100 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థకు హైదరాబాద్‌లో తయారీ కేంద్రం ఉన్నది. దీనికి అనుబంధ సంస్థగా ఉన్న కంపెనీ ఏవీఈవీఏ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. కేటీఆర్ వెంట ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ విభాగం డైరెక్టర్ ప్రవీణ్ తదితరులున్నారు.
టీ హబ్‌కు గొప్ప ప్రోత్సాహం: కేటీఆర్
హైదరాబాద్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్న ప్లగ్ అండ్ ప్లే నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. ఈ సంస్థ రాక రాష్ట్రంలో ఇన్నోవేషన్ ఎకోసిస్టంకు గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుందని తెలిపారు. ముఖ్యంగా దేశంలోని అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ అయిన టీ హబ్‌కు ఎంతో ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు. మొబిలిటీ రంగంలో జెడ్ఎఫ్, ఫియట్ క్రిస్లర్/స్టెలాంటిస్ తదితర సంస్థల నుంచి భారీ పెట్టుబడులు సాధించడంలో తెలంగాణ సఫలీకృతమైందని వెల్లడించారు. అనేక ఓఈఎంలు, టైర్-1 సరఫరాదారుల భాగస్వామ్యంతో ప్రపంచస్థాయి మొబిలిటీ వ్యవస్థను రూపొందించే ప్రక్రియలో తెలంగాణ ముందుకు సాగుతున్నదని వివరించారు. మొబిలిటీ రంగం అభివృద్ధికి ఇన్నోవేషన్ చాలా కీలకమైనదని పేర్కొన్నారు. భారత్‌లో తమ లొకేషన్‌గా హైదరాబాద్‌ను ఎంపికచేసుకున్న ప్లగ్ అండ్ ప్లే సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. హెల్త్‌కేర్, ఐవోటీ, ఎనర్జీ, ఫిన్‌టెక్ తదితర రంగాల్లో తెలంగాణ గణనీయ అభివృద్ధి సాధిస్తున్నదని తెలిపారు.
బోర్డియాక్స్‌తో ఎంవోయూ
సుస్థిర నగరాల అభివృద్ధిలో కలిసి పనిచేయాలని తెలంగాణ ప్రభుత్వం, ఫ్రాన్స్‌కు చెందిన బోర్డియాక్స్ మెట్రోపోల్ నిర్ణయించాయి. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ సమక్షంలో బోర్డియాక్స్‌తో రాష్ట్రప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకొన్నది. పారిస్‌లోని చారిత్రక లక్సెంబర్గ్ ప్యాలెస్ కాన్ఫరెన్స్ హాల్ లో ఎంవోయూపై ఇరుపక్షాల ప్రతినిధులు సంతకాలు చేశారు. సుస్థిర నగరాల అభివృద్ధికి ఉమ్మడి ప్రాజెక్టులను రూపొందించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుంది. ఈ ఎంవోయూ ఇరుపక్షాల మధ్య అక్టోబర్ 13, 2015న ప్రారంభమైన సహకార ఒప్పందానికి కొనసాగింపు అని అధికారులు వెల్లడించారు.