పుణే: వరుస పరాజయాలతో ఇబ్బందిపడుతున్న ముంబై ఇండియన్స్ జట్టు సభ్యుల్లో కెప్టెన్ రోహిత్ శర్మ ఆత్మవిశ్వాసం నింపాడు. రానున్న మ్యాచ్‌ల్లో మరింత కసితో ఆడాలని సూచించాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకు ఐదు సార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై జట్టు.. తాజా సీజన్లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. ఇలాంటి సమయంలో డీలా పడొద్దని.. తిరిగి బలంగా పుంజుకోవాలని జట్టు సభ్యులకు రోహిత్ ధైర్యాన్నిచ్చాడు. ‘ముంబై ఓడినా గెలిచినా సమిష్టిగానే బాధ్యత తీసుకుంటాం. మనం ఇక్కడ ఏ ఒక్కర్నీ వ్యక్తిగతంగా నిందించడం లేదు. అయితే ఇకపై మనలో కాస్త తెగింపు పెరగాలి. ప్రత్యర్థుల కన్నా మనం ముందుండాలి. అది సాధ్యపడాలంటే మనమంతా గెలువాలన్న కసితో ఆడాలి. లీగ్ ఇప్పుడే ఆరంభమైంది కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కీలక సమయాల్లో మరింత మెరుగ్గా ఆడుదాం’ అని రోహిత్ ఆటగాళ్లతో అన్నాడు. కోల్‌కతాతో మ్యాచ్‌లో విజయం అంచుల వరకు వచ్చినా.. కమిన్స్ ఊచకోతతో వెనుకబడిపోయిన ముంబై శనివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో అమీతుమీ తేల్చుకోనుంది.