
హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య
సుల్తాన్‌బజార్, డిసెంబర్ 4 : కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి వైద్యులు, సిబ్బంది విశేష సేవలందించారని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) చైర్మన్ జస్టిస్ గుండా చంద్రయ్య అన్నారు. శనివారం ఎల్డర్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (ఇసీఐఎఫ్),ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) తెలంగాణ రాష్ట్ర శాఖ సంయుక్తాధ్వర్యంలో సీనియర్ వైద్యులకు వైద్య సేవారత్న అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఇసీఐఎఫ్ ఫౌండర్, మేనేజింగ్ ట్రస్టీ మందడి కృష్ణారెడ్డి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ సంపత్, కార్యదర్శి బీఎన్ రెడ్డి, ఫైనాన్స్ సెక్రెటరీ గట్టు శ్రీనివాసులతో కలిసి వయోవృద్ధులకు ఉత్తమ వైద్య సేవలందిస్తున్న 62 మంది సీనియర్ వైద్యులకు వైద్య సేవారత్న అవార్డులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. అనంతరం జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ వైద్యులు ఎలాంటివి ఆశించకుండా వయోవృద్ధులకు ఉత్తమ సేవలందించాలని సూచించారు. ఇసీఐఎఫ్ ఫౌండర్, మేనేజింగ్ ట్రస్టీ మందడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ తమ ఫౌండేషన్ 95 లక్షల మంది సభ్యులున్న అతిపెద్ద సంస్థ అన్నారు. ప్రతినెలా 500 మంది వయోవృద్ధులను వారివారి రంగాల్లో ఉన్నతమైన వారిని గుర్తించి సన్మానిస్తున్నట్లు చెప్పారు. ప్రతినెలా మొదటి శనివారం ఉదయం 10 గంటల నుంచి నుంచి 1 గంట వరకు వయోవృద్ధులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని ఐఎంఏ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ సంపత్ తెలిపారు. కార్యక్రమంలో ఇసీఐఎఫ్ వైస్ చైర్మన్ డాక్టర్ ఆవులప్ప, హెల్త్‌కేర్ కమిటీ సభ్యుడు డాక్టర్ హరికుమార్, ఈఎన్టీ ప్రభుత్వ దవాఖాన హెచ్‌వోడీ డాక్టర్ సుదర్శన్‌రెడ్డి, డాక్టర్ దుర్గాప్రసాద్, సీనియర్ వైద్యులు పాల్గొన్నారు.