హైదరాబాద్ మార్చి 20 (నమస్తే తెలంగాణ ) : బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి టీ హరీశ్‌రావుపై పంజాగుట్ట పోలీసులు నమోదుచేసిన ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు కొట్టివేసింది. హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, కాంగ్రెస్ నాయకుడు చక్రధర్‌గౌడ్ తగిన ఆధారాలను చూపలేదని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ గురువారం 36 పేజీల తీర్పును వెలువరించారు. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపిస్తూ చక్రధర్‌గౌడ్ చేసిన ఫిర్యాదుపై టీ హరీశ్‌రావు, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు మీద పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ముగించిన హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ‘హరీశ్‌రావు, రాధాకిషన్‌రావుపై నమోదైన కేసులో అభియోగాలకు తగిన ఆధారాలు లేవు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి పోటీచేసిన హరీశ్‌రావు, చక్రధర్‌గౌడ్ మధ్య రాజకీయ శత్రుత్వం కనిపిస్తున్నది. దీనికితోడు ఫిర్యాదు చేయడంలో అసాధారణ జాప్యం జరిగింది. ఇందుకు కారణాలు ఎక్కడా లేవు. డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులోగానీ, హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో గాని ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు పేర్కొనలేదు. ఈ నేపథ్యంలో పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ చెల్లదు’ అని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.
పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలన్న హరీశ్, రాధాకిషన్‌రావు విజ్ఞప్తికి కోర్టు సమ్మతించింది. చక్రధర్‌గౌడ్ సెప్టెంబర్ ఒకటిన పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పిటిషనర్లు బలవంతపు వసూళ్లకు పాల్పడినట్టుగానీ, ప్రజాప్రతినిధిగా విశ్వాసఘాతుకానికి పాల్పడినట్టుగానీ, నేరపూరిత బెదిరింపులకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు చేయలేదని గుర్తుచేసింది. ఐటీ చట్టంలోని సెక్షన్ కింద ఫిర్యాదులో ఎలాంటి ఆరోపణలు లేవని తెలిపింది. డీజీపీకి గత ఏడాది జూన్ 18న చక్రధర్ ఇచ్చిన వినతిపత్రంలోగానీ, గత ఏడాది ఇదే హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లోగానీ, డిసెంబర్ ఒకటిన పంజాగుట్ట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోగాని దోపిడీ, బెదిరింపులు, నమ్మకద్రోహం, నేరపూరిత చర్యలకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు చేయలేదని గుర్తుచేసింది. ఆరోపణలన్నీ పూర్తిగా ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించినవేనని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఐపీసీ సెక్షన్ 386 కింద ఎఫ్ఐఆర్ నమోదుకు వీల్లేదని స్పష్టంచేసింది.
చక్రధర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంలో జరిగిన ఆలస్యానికి కారణాలు ఎక్కడా పేర్కొనలేదు. 2023 ఆగస్టులో ఆపిల్ ఫోన్ కంపెనీ నుంచి ఫోన్ ట్యాపింగ్ అవుతున్నదని మెసేజ్ వచ్చిందని 2024లో డీజీపీకి వినతిపత్రం ఇచ్చారు. అదే ఏడాది డిసెంబర్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు 2023లో మెసేజ్ వస్తే 2024 డిసెంబర్ వరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదో వివరించలేదు. హరీశ్‌రావు మంత్రిగా ఉన్నందున, ఆయనకు రాధాకిషన్‌రావు సన్నిహితుడిగా ఉన్నందున భయపడి ఫిర్యాదు చేయలేదని అనుకుంటే.. 2023 డిసెంబర్లోనే హరీశ్ మంత్రిగా ఉన్న ప్రభుత్వం మారిపోయింది. కొత్త ప్రభుత్వం వచ్చాక అంటే 2023 డిసెంబర్లో చక్రధర్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండవచ్చు అని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో కేసు కొనసాగింపునకు అనుమతిస్తే న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేసినట్టు అవుతుంది. కాబట్టి పంజాగుట్ట పోలీసులు పెట్టిన కేసుకు చట్టబద్ధత లేదు.. అని తీర్పు వెలువరించింది. హరీశ్‌రావు తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు, న్యాయవాది ఆర్ చంద్రశేఖర్‌రెడ్డి, పోలీసుల తరఫున పీపీ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపించారు.
‘ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన రాధాకిషన్‌రావు 2023 ఆగస్టు నుంచి ఈ ఏడాది జనవరి 30 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆ కేసు దర్యాప్తు పూర్తికావడమే కాకుండా చార్జిషీట్ కూడా దాఖలైంది. ఆ కేసులో 60వ సాక్షిగా ఉన్న చక్రధర్‌గౌడ్ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. అందులో చెప్పిన విషయాలతోనే పంజాగుట్ట పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. చక్రధర్‌గౌడ్‌ను పలు కేసుల్లో అరెస్ట్ చేసినట్టు పోలీసులు తమ కౌంటర్లో పేర్కొన్నారు. ఆయా కేసుల్లో చక్రధర్‌ను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చినప్పుడు రాధాకిషన్‌రావు వేధించినట్టు కింది కోర్టులో చెప్పలేదు. కాబట్టి చక్రధర్‌గౌడ్ తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ పంజాగుట్ట పోలీసులకు చేసిన ఫిర్యాదులోని అభియోగాలకు ఆధారాలు లేవు. కాబట్టి ఐపీసీ సెక్షన్లు 386, 409, 506, ఐటీ చట్టంలోని 66 కింద ఎఫ్ఐఆర్ను కొనసాగించేందుకు ఆస్కారం లేదు’ అని హైకోర్టు తన తీర్పులో వివరించింది.