Godhavarikhani | రామగిరి, మార్చి 31: 2024-25 ఆర్థిక సంవత్సరంలో రామగుండం-3 ఏరియా సీహెచ్పీ ద్వారా ఒక్క రోజులోనే అత్యధికంగా అనగా రైలు మార్గంలో 30,839 టన్నుల బొగ్గు రవాణా చేయగా సీహెచ్పీ అధికారులు, ఉద్యోగులను సోమవారం రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు అభినందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి 30న ఉగాది సందర్భంగా ఈ రికార్డు సాధించడం సంతోషకరమన్నారు. ఈ ఒక్క రోజులోనే 15 రైల్వే రేకుల ద్వారా ఎన్టీపీసీ సంస్థకు 30,839 టన్నుల బొగ్గును రవాణా చేయడమే కాకుండా, రోడ్డు మార్గం ద్వారా 200 టన్నుల బొగ్గును రవాణా చేసి మొత్తం రామగుండం-3 ఏరియా నుంచి 31,039 టన్నుల బొగ్గును రవాణా చేసేందుకు కృషి చేసిన అధికారులు, ఉద్యోగులను, కార్మిక సంఘ నాయకులను అభినందించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా ఉద్యోగులందరూ కలసి కట్టుగా పని చేస్తూ, నిర్దేశించిన లక్ష్యాలను భద్రతతో సాధించాలని కోరారు.