లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మరోసారి సొంత పార్టీపై మండిపడ్డారు. ఈసారి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. వరదల నేపథ్యంలో గాల్లో చక్కర్లు కొడుతున్న ఆయనకు గ్రౌండ్ సమస్యలు కనిపించలేదని విమర్శించారు. భారీ వర్షాలు, వరదలకు విద్యార్థులు ఇబ్బంది పడినా ఉత్తర ప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ కమిషన్ (యూపీఎస్ఎస్సీ) కోసం నిర్వహించే ప్రిలిమినరీ ఎలిజిబిలిటీ టెస్ట్ (పీఈటీ)ను వాయిదా వేయకపోవడంపై ధ్వజమెత్తారు.
ఉత్తరప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో పీఈటీని వాయిదా వేయాలని అభ్యర్థులు, విద్యార్థులు డిమాండ్ చేశారు. అయినప్పటికీ సీఎం యోగి ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో శనివారం నిర్వహించిన ఈ పోటీ పరీక్షకు హాజరయ్యేందుకు అభ్యర్థులు చాలా కష్టాలు పడ్డారు. వర్షాలు, వరదలకు సరైన రవాణా సౌకర్యాలు లేక నానా అవస్థలు పడ్డారు. లక్షలాది అభ్యర్థులు రైల్వే స్టేషన్లకు చేరుకుని కిక్కిరిసిన రైళ్లలో ప్రయాణించారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొని చివరకు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.
కాగా, పీఈటీ అభ్యర్థులు ఎదుర్కొన్న ఇబ్బందులపై అధికార బీజేపీకి చెందిన పిలిభిత్ ఎంపీ వరుణ్ గాంధీ చలించిపోయారు. అభ్యర్థులతో కిక్కిరిసిన రైల్వే స్టేషన్లు, రైళ్ల ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. యూపీని వరదలు ముంచెత్తినప్పటికీ సుమారు 37 లక్షల మందికిపైగా విద్యార్థులు పీఈటీ పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. అభ్యర్థులకు పెద్ద సవాల్ ఈ ‘ప్రశ్న పత్రం పరిష్కరించడం’ కాదని, పరీక్షా కేంద్రానికి చేరుకోవడం అని పేర్కొన్నారు.
వరదల నేపథ్యంలో పరీక్షను వాయిదా వేయాలని విద్యార్థులు డిమాండ్ చేసిన సంగతిని వరుణ్ గాంధీ గుర్తు చేశారు. అయినప్పటికీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ పరీక్షను వాయిదా వేయకపోగా తగిన రవాణా ఏర్పాట్లు కూడా చేయలేదని ఆయన విమర్శించారు. ‘బహుశా వరద ప్రాంతాల్లో ‘ఎరియల్ సర్వే’లు చేస్తున్న ఆయనకు ‘గ్రౌండ్ ఇష్యూస్’ కనిపించకపోవచ్చు’ అంటూ హిందీలో ట్వీట్ చేసి ఎద్దేవా చేశారు.
यूपी बाढ़ की चपेट में हैं और 37 लाख से अधिक छात्र PET की परीक्षा देने निकले हैं।
प्रश्नपत्र हल करने से बड़ी चुनौती सेंटर तक पहुँचना है। छात्रों की निरंतर माँग के बाद भी ना परीक्षा टाली गयी ना यातायात के पुख्ता इंतजाम किए गए।
शायद ‘हवाई निरीक्षण’ से ‘जमीनी मुद्दे’ नहीं दिखते। pic.twitter.com/BXDmiFJ9N9
— Varun Gandhi (@varungandhi80) October 15, 2022