Eye Problems | కళ్లు పొడిబారడం (డ్రై ఐ సిండ్రోమ్) ప్రస్తుతం చాలా మందిలో కనిపిస్తున్న సాధారణ సమస్య. ఎక్కువసేపు కంప్యూటర్, మొబైల్ స్క్రీన్లను చూడటం, ఏసీ గదుల్లో ఎక్కువ సమయం గడపడం, వయస్సు పెరగడం, కొన్ని ఆరోగ్య సమస్యలు లేదా పోషకాల లోపం వంటి కారణాల వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. దీనివల్ల కళ్లలో మంట, ఎర్రబడటం, మసకగా కనిపించడం, కనురెప్పలు అతుక్కుపోయినట్లు అనిపించడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే కొన్ని సహజమైన చిట్కాలు, సరైన ఆహారపు అలవాట్లు ఈ సమస్య నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయి. కళ్ల ఆరోగ్యానికి విటమిన్ ఎ, విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం అవసరం. ముఖ్యంగా విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. క్యారెట్, బొప్పాయి, మామిడి, పాలకూర వంటి ఆకుకూరలు, పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగు కూరగాయలను ఆహారంలో చేర్చడం వల్ల అవసరమైన పోషకాలు అందుతాయి. అలాగే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కళ్లలో సహజంగా కన్నీటి ఉత్పత్తి మెరుగుపడి పొడిబారడం తగ్గే అవకాశం ఉంటుంది.
కొబ్బరి నూనె కూడా డ్రై ఐ సమస్యలో కొంత ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, తేమను కాపాడే గుణాలు కళ్ల చుట్టూ ఉన్న చర్మాన్ని మృదువుగా ఉంచడంలో సహాయపడతాయి. రెండు నుంచి మూడు చుక్కల కొబ్బరి నూనెను కళ్ల చుట్టూ నెమ్మదిగా రెండు నుంచి మూడు నిమిషాలు మసాజ్ చేసి, చర్మం పూర్తిగా పీల్చుకునే వరకు వదిలేయాలి. అయితే నూనె నేరుగా కంట్లో పడకుండా జాగ్రత్త వహించాలి. కీరదోస ముక్కలను కళ్లపై ఉంచడం కూడా ఉపశమనం కలిగించే చిట్కాల్లో ఒకటి. చల్లగా ఉంచిన కీరదోస ముక్కలను 15 నిమిషాల పాటు కళ్లపై ఉంచితే మంట, దురద, ఎర్రదనం తగ్గడంలో సహాయపడుతుంది. కీరదోసలో ఉండే విటమిన్ ఎ కళ్లకు పోషణ అందించడంలో ఉపయోగపడుతుంది. రోజూ ఒక గిన్నె పెరుగు తినడం కూడా కళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పెరుగులో విటమిన్ డి, విటమిన్ బి, విటమిన్ ఎ వంటి పోషకాలు ఉండటంతో కళ్లకు అవసరమైన పోషణ అందించి పొడిబారడం వల్ల కలిగే అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
కళ్లను తరచూ రెప్పవేయడం కూడా చాలా ముఖ్యమైన అలవాటు. రెప్పవేయడం వల్ల సహజంగా కన్నీటి పొర కంటి ఉపరితలంపై సమానంగా వ్యాపించి తేమను నిలబెడుతుంది. ముఖ్యంగా కంప్యూటర్ లేదా మొబైల్‌ను ఎక్కువసేపు ఉపయోగించే వారు ప్రతి కొద్ది నిమిషాలకు ఒకసారి రెప్పవేయడాన్ని అలవాటు చేసుకోవాలి. గోరువెచ్చని నీటిలో ముంచిన మెత్తని వస్త్రంతో కళ్లకు కాపడం పెట్టడం కూడా మంచి ఉపశమనం ఇస్తుంది. మెత్తని వస్త్రాన్ని గోరువెచ్చని నీటిలో ముంచి అదనపు నీటిని పిండి, కళ్లపై ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఉంచాలి. ఇలా చేయడం వల్ల కళ్ల చుట్టూ రక్తప్రసరణ మెరుగుపడి సహజమైన తేమ ఉత్పత్తికి దోహదపడుతుంది. అయితే కళ్లు పొడిబారడం ఎక్కువకాలం కొనసాగితే, తీవ్రమైన నొప్పి, చూపు తగ్గడం లేదా ఇతర అసాధారణ లక్షణాలు కనిపిస్తే ఇంటి చిట్కాలపై మాత్రమే ఆధారపడకుండా వెంటనే నేత్ర వైద్యుడిని సంప్రదించడం అవసరం.