అబలయని దేశమును కబళించ తలపడిన
పరరాజులకు స్త్రీల పటు శౌర్యమును చూపి
రాజతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా!
కుట్రలను, కుతంత్రాలను చీల్చి చెండాడుతూ రాజ్యపాలన చేసి, స్త్రీ శక్తిని చాటిన కాకతీయ మహారాణి రుద్రమదేవి లాంటి ఎందరో ధీరవనితలకు ఆయువుపోసిన పౌరుషాల గడ్డ మన తెలంగాణ. దొరల అహంకారంపై సమ్మక్క, సారక్కలు కత్తి దూసిన నేల ఇది. చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలమ్మలు ఆయుధమెత్తి నడిచిన గడ్డ ఇది. దొరల కుటుంబంలో పుట్టి దొరలపైనే యు ద్ధం ప్రకటించిన మల్లు స్వరాజ్యమ్మకు పురుడుపోసిన మట్టి ఇది. భూవిముక్తిలోనే స్త్రీ విముక్తి ముడిపడి ఉందని సా యుధ పోరులో మరఫిరంగులై గర్జించిన మద్ది స్వర్ణమ్మ, బెల్లి లలితక్కలు పుట్టిన త్యాగాల చాలు నా తెలంగాణ.
ఇట్లాంటి వీర తెలంగాణలో నేడు స్త్రీల ఆత్మగౌరవం మీద దాడి జరిగింది. అందాల పోటీలకు వచ్చిన అందగత్తెల కాళ్లను మన తెలంగాణ ఆడబిడ్డలతో కడిగించి, గుడ్డలతో తుడిపించి.. మన ఆడబిడ్డలను దారుణంగా అవమానించారు. ఇట్లాంటి నీచమైన ఘటనలు మధ్యయుగాల నాడు కూడా జరిగి ఉండవు. సాటి మనిషిని మనిషిగా గుర్తించని ఫ్యూడల్ సంస్కృతి ఇది. ఈ నీచమైన పనిని విమర్శించడం మాని ఒక మహిళా మంత్రి.. ఇది సరైన చర్యేనని సమర్థించడం దివాళాకోరుతనం. ఆమె తాను విప్లవకారిణిని అంటూ ప్రచారం చేసుకుంటూ.. నక్సలైట్లపై ప్రజలకున్న గౌరవాన్ని తన స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నది.
అంతో ఇంతో చదువుకున్న సాధారణ మహిళలు కూడా అంగీకరించని నీచమైన పని ఇది. కాళ్లు కడగడాన్ని వెనకేసుకురావడం నక్సలైటునని చెప్పుకొంటున్న ఆ మంత్రి నైతిక పతనాన్ని సూచిస్తుంది. నక్సలైటు అంటే ఇటీవల పోలీసు కాల్పుల్లో వీరమరణం పొందిన కడివెండి రేణుకక్కలా ఉంటారు. ఈమెలా పదవుల కోసం ఆధిపత్య శక్తుల పాదాల దగ్గర మోకరిల్లేవారు ఎన్నటికీ నక్సలైట్లు కాలేరు. స్త్రీలు సాధికారత, స్వావలంబన, సమాన అవకాశాల కోసం గళమెత్తుతుంటే ఈ కుహనా విప్లవకారిణి సాటి మహిళలను మనుషులుగా గుర్తించనిరాకరిస్తున్నది.
అందాల పోటీల పేరిట ఇక్కడ జరుగుతున్నది పక్కా వ్యాపారమని, ఈ డాక్టరేట్ డిగ్రీ హోల్డర్‌కి తెలియదనుకోవాలా? అందాల పోటీలంటే స్త్రీని ఆటబొమ్మగా చూసే సామ్రాజ్యవాద విష సంస్కృతి అని ఈ మహిళా మంత్రికి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఈమె నకిలీ నక్సలైటు కాబట్టి. ముందు ఈమె తన సొంత పేరుతో చెలామణి కావాలి. అక్కల పేరును చెడగొట్టే సీతక్క అనే పేరును తీసేసుకోవాలి. విప్లవకారు ల పేరుమీద చెలామ ణి అవుతూ విప్లవోద్యమా న్ని దెబ్బతీసే ఇ ట్లాంటి వారిని రెనెగేడ్ అంటా రు. ధనసరి అనసూయ లాంటి ప్రజాద్రోహిని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ క్షమించరు.
(వ్యాసకర్త: అధికార భాషా సంఘం పూర్వ అధ్యక్షురాలు)
శ్రీదేవి మంత్రి