హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా భానుడు భగ్గుమంటున్నాడు. ఎండవేడి, వడగాలులు ధాటికి తాళలేక జనం అల్లాడిపోతున్నారు. ఉత్తర తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలకు జనం సతమతమవుతున్నారు. ఉదయం 9 గంటలు దాటాక బయటకు రావాలంటే జంకుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది.
గురువారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఒకటి రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గడంతోపాటు, అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసినట్టు తెలిపింది.
ఆదిలాబాద్లో అత్యధికంగా 46 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 45.9, జగిత్యాల జిల్లా రాయికల్లో 45.8, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కరిమెరలో 45.8, నిర్మల్ జిల్లా భైంసాలో 45.8, నిజామాబాద్ జిల్లా మోస్రాలో 45.8, పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో 45.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించింది.