UPS | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): మలి సంధ్య వేళలో ఆర్థిక అవసరాలను తీర్చే పింఛన్.. పండుటాకులకు కొండంత అండ. అయితే, ప్రభుత్వ, ప్రైవేటురంగంలో పనిచేసి పదవీవిరమణ చేసిన ఉద్యోగులకే ఈ పింఛన్ సదుపాయం ఉంది. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు, వ్యాపారులు, గృహిణులకు ఇలాంటి ఆర్థిక భరోసానిచ్చే పథకాలు దాదాపుగా ఏమీ లేవు. దీంతో వయసుపైబడిన సమయంలో లక్షలాదిమంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. దీనికి చెక్ పెట్టేందుకు కేంద్రప్రభుత్వం ‘యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)’ పథకాన్ని తీసుకొచ్చే యోచనలో ఉన్నది. ఈ మేరకు జాతీయ పత్రిక ‘ఎకనమిక్ టైమ్స్’ ఓ కథనంలో వెల్లడించింది.
ఏమిటీ యూపీఎస్?
దేశంలోని 60 ఏండ్లు పైబడిన వారందరికీ నిర్ణీత వ్యవధుల్లో నిర్ణీత మొత్తాన్ని పింఛన్‌గా అందించే పథకాన్నే యూపీఎస్గా పిలుస్తున్నారు.ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) ఈ మెగా స్కీమ్ విధివిధానాలపై కసరత్తు ప్రారంభించిందని, త్వరలోనే దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని అధికారి ఒకరు వెల్లడించారు.
ఎవరెవరు అర్హులు?
18 ఏండ్లు పైబడిన వారందరూ ఈ స్కీమ్‌కు అర్హులు. ముఖ్యంగా పింఛన్ సౌకర్యంలేని అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు, వ్యాపారులు, గృహిణులు, స్వయం ఉపాధిపొందేవారికి ఈ పథకం మెరుగైంది. ఈ స్కీమ్‌లో చేరేవారు విడుతల వారీగా కొంత డబ్బును చెల్లించాల్సి ఉంటుంది. ఖాతాదారులు కట్టే సొమ్ముకు సమానమైన మొత్తాన్ని అటు ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. అలా.. 60 ఏండ్లు దాటిన తర్వాత పింఛన్ డబ్బులు సబ్‌స్ర్కైబర్లకు అందుతాయి.
ఒకే గొడుగు కింద
వ్యాపారులు, స్వయం ఉపాధి పొందే వారికోసం ప్రభుత్వం ఇప్పటికే నేషనల్ పెన్షన్ స్కీమ్ ఫర్ ట్రేడర్స్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్డ్ (ఎన్పీఎస్-ట్రేడర్స్), పీఎం శ్రమ్ యోగీ మాందాన్ యోజన (పీఎం-ఎస్వైఎం) పేరిట కొన్ని పింఛన్ పథకాలను కొనసాగిస్తున్నది. ఇప్పుడు ఎన్పీఎస్-ట్రేడర్స్, పీఎం-ఎస్వైఎం స్కీమ్‌లను కలిపి మొత్తంగా అన్నింటినీ యూపీఎస్ మెగా స్కీమ్ గొడుగు కిందకు తీసుకురావాలని కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం. ఇది అమలైతే 60 ఏళ్ల తర్వాత పింఛన్‌ను అందుకోవచ్చు.