పీర్జాదిగూడ, ఏప్రిల్ 5: పన్ను వసూళ్లలో పురోగతి సాధించి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి స్థానం దక్కించుకుంది. 2024-25 సంవత్సరానికి గాను రూ 23.72 కోట్లకు గాను రూ.20.90 కోట్ల పన్నులు వసూలు చేశారు. దీంతో పన్నుల వసూలు విషయంలో మేడ్చల్ జిల్లాలోనే మొదటి స్థానం, రాష్ట్రంలో పదో స్థానం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ దక్కించుకుంది. పన్నుల చెల్లింపుల విషయంలో కార్పొరేషన్లోని ప్రజలకు అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడంతోనే అధిక పన్నులు వసూలు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్ డాక్టర్ శ్రీదేవి చేతుల మీదుగా పీర్జాదిగూడ మున్సిపల్ కమిషనర్ త్రీలేశ్వరరావు జ్ఞాపికను అందుకున్నారు. మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి, నగర ప్రజలందరి భాగస్వామ్యంతోనే ఈ ఘనత దక్కిందని కమిషనర్ త్రీలేశ్వరరావు ఈ సందర్భంగా తెలిపారు. సకాలంలో ఆస్తి పన్నులు చెల్లించి ఆదర్శంగా నిలిపిన ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు చెప్పారు.