న్యూఢిల్లీ, నవంబర్ 18: ఇప్పటివరకూ దేశంలో వచ్చిన ఐపీవోల్లోకెల్లా అతిపెద్ద ఆఫర్‌ను జారీచేసిన పేటీఎం లిస్టింగ్ రోజున ఇన్వెస్టర్లకు భారీ నష్టాల్ని మూటగట్టింది. పేమెంట్ ప్లాట్‌ఫామ్ పేటీఎంను నిర్వహిస్తున్న ఒన్97 కమ్యూనికేషన్స్ షేరు గురువారం బీఎస్ఈలో ఆఫర్ ధరతో పోలిస్తే 27 శాతం పతనమై రూ. 1,564 వద్ద ముగిసింది. ఈ కంపెనీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కు రూ.2,150 ధరను నిర్ణయించింది. ఈ ధరకంటే 9 శాతం తక్కువగా రూ. 1,955 వద్ద లిస్టయిన పేటీఎం ఏ సమయంలోనూ ఆఫర్ ధరను దాటలేకపోగా, క్రమేపీ క్షీణిస్తూ రోజులో కనిష్ఠధర వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈలో ఇది రూ. 1,950 వద్ద లిస్టయ్యి, రూ. 1,562 వద్ద ముగిసింది.
రూ.2,150 ధరతో పబ్లిక్ ఇష్యూను జారీచేసి రూ.18,300 కోట్లను సమీకరించడం ద్వారా పదేండ్ల క్రితం కోల్ ఇండియా రూ.15,000 కోట్ల ఆఫర్ పరిమాణాన్ని పేటీఎం అధిగమించి రికార్డు సృష్టించింది. ఐపీవో ధర వద్ద కంపెనీ మార్కెట్ విలువ రూ.1.39 లక్షల కోట్లుగా నమోదయ్యింది. అయితే లిస్టింగ్ రోజున ముగింపు ధర వద్ద కంపెనీ విలువ రూ.1.01 లక్షల కోట్లకు పడిపోయింది. దీంతో కంపెనీలో మదుపరులు రూ. 38,000 కోట్ల సంపద నష్టపోయినట్లయ్యింది. స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ట్రేడవడం కూడా పేటీఎం షేర్లను ముంచేసింది. కాగా, మరో ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ జొమాటో మార్కెట్ విలువే ప్రస్తుతం పేటీఎం కన్నా ఎక్కువ.
బీఎస్ఈలో పేటీఎం లిస్టింగ్ సందర్భంగా ఆ కంపెనీ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు. జాతీయ గీతం వినిపించినపుడు ‘భారత భాగ్య విధాత’ అనే మాటలు వింటే తనకు కన్నీళ్లోస్తాయన్నారు. శర్మ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ పేటీఎం ఎంతో మంది ఔత్సాహిక వాణిజ్య వేత్తలకు ప్రేరణ ఇచ్చిందని, ఏదైనా చేయగలమన్న విశ్వాసాని కల్పించిందన్నారు. ‘అంత అధిక విలువలకు నిధులు ఎలా సమీకరించావంటూ జనం అడుగుతుంటారు. నేను ధర ఆధారంగా డబ్బు సేకరించలేదు, ప్రయోజనం కోసం ధనం సమీకరించా’ అని తాను చెపుతుంటానన్నారు. అలీఘర్‌లో ఉపాధ్యాయుడి కుమారుడైన విజయ్ శేఖర్ శర్మ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. 2010లో మొబైల్ రీఛార్జ్ కంపెనీగా పేటీఎంను నెలకొల్పి, తదుపరి పేమెంట్స్ ప్లాట్‌ఫామ్‌గా మార్చారు. 2016లో డీమానిటైజేషన్ తర్వాత కంపెనీ వ్యాపారం శరవేగంగా
విస్తరించింది.