కొడంగల్, జూలై 3: సీఎం రేవంత్ రెడ్డి ఇలాఖాలోని ప్రభుత్వ దవాఖానల్లో పూర్తిస్థాయి సౌకర్యాలు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. కొడంగల్‌లోని 50 పడకల హాస్పిటల్ నుంచి నుంచి 220 పడకల దవాఖానగా అప్‌గ్రేడ్ అయినప్పటికీ పూర్తి సౌకర్యాలు అందుబాటులో ఉండటం లేదని రోగులు వాపోతున్నారు. తాజాగా ప్రింటర్ చెడిపోవడంతో రక్తం నమూనాలకు సంబంధించిన రిపోర్టులు తీసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగైదు రోజులుగా హాస్పిటల్‌లోని సిస్టం ప్రింటర్‌ను మరమ్మతులు చేస్తుండటంతో హాస్పిటల్ సిబ్బంది చేతిరాతతో రోగులకు రిపోర్టులు అందిస్తున్నట్లు తెలిపారు.
రక్త నమూనాకు సంబంధించిన రిపోర్టులు కావాలంటే కంప్యూటర్ తెరపై ఉన్న రిపోర్టులను ఫొటో తీసుకోవాల్సిన దుస్థితి తలెత్తుతుందని ఆరోపిస్తున్నారు. పీహెచ్సీ దవాఖానను వైద్య విధాన పరిషత్ లో కలపడంతో ఉత్తమమైన వైద్య సేవలు అందుకోవచ్చు అని భావించిన ప్రజలకు నిరాశే మిగులుతుందని పేర్కొంటున్నారు. 50 పడకల దవాఖాన ఉన్నప్పుడే ఇటువంటి పరిస్థితి ఉందంటే 220 పడకల హాస్పిటల్ భవనం పూర్తయితే రోగుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చిన్నపాటి ప్రింటర్ మరమ్మతులకే చర్యలు తీసుకోవడం లేదని, ఇక పూర్తిస్థాయి వైద్య సేవలు ఏ విధంగా ఉంటాయోనని ఆందోళన వ్యక్తమవుతున్నది. సాధారణంగా రక్త నమూనాలను స్వీకరించిన రిపోర్టులు రోగి ఫోన్‌కు వాట్సాప్ ద్వారా అందిస్తున్నారు. కానీ ప్రస్తుతం అవి కూడా ఫోన్ సమాచారం ఇవ్వడం లేదని చెబుతున్నారు. తద్వారా హాస్పిటల్‌కు చేరుకొని రిపోర్టు చూసుకోవాల్సి వస్తుందని రోగులు తెలిపారు. ఈ విషయమై ల్యాబ్ సిబ్బంది వివరణ కోరగా ప్రింటర్ చెడిపోయిన కారణంగా చేతిరాత ద్వారా గత నాలుగు ఐదు రోజులుగా రోగులకు రిపోర్టులు అందిస్తున్నామని తెలిపారు.