హైదరాబాద్ : పేరుగొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది ఖమ్మం(Khammam )జిల్లా ప్రజల పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులయ్యారు. అందులో ఒకరు డిప్యూటీ సీఎం కూడా ఈ జిల్లా నుంచే ఉండటం విశేషం. అయితే క్యాబినేట్లో ముగ్గురు మినిస్టర్స్ ఉన్నా ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ దవాఖాన దుస్థితి ఏ మాత్రం మారడం లేదు. పలు దవాఖానల్లో లో వోల్టేజ్ సమస్యతో ఏసీలు, వైద్య పరికరాలు పని చేయకపోవడంతో రోగులు, వైద్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఖమ్మం జిల్లా ప్రధాన హాస్పిటల్లో విద్యుత్ సరఫరాకు సరిపడా ట్రాన్స్ఫార్మర్లు లేక, లో వోల్టేజ్ సమస్యలతో ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లు, బాలింతల విభాగంలో సైతం ఏసీలు పని చేయడం లేదని ఫిర్యాదులు వెల్తువెత్తున్నాయి. 240 రావాల్సిన వోల్టేజ్ కేవలం 180 నుండి 200 మాత్రమే రావడంతో పరికరాలు తరచుగా కాలిపోతున్నాయని దవాఖాన వైద్య సిబ్బంది చెప్తున్నారు.
అలాగే ఏసీలు లేక ఆపరేషన్ థియేటర్, ఐసీయూల నుంచి దుర్వాసన వస్తుందని సిబ్బంది ఆరోపిస్తున్నారు. పలు విభాగాల్లో అత్యవసర పరికరాలు కూడా పని చేయకపోవడంతో సరైన చికిత్స అందించలే కపోతున్నామని వైద్యుల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎండాకాలంలో ఏసీలు పనిచేయక రోగులు, వైద్యులు ఇబ్బంది పడుతున్నారని సరిపడా ట్రాన్స్ఫార్మర్లు అమర్చి, నాణ్యమైన విద్యుత్ అందించాలని రోగులు, సిబ్బంది కోరుతున్నారు.