ఖలీల్‌వాడి, జూలై 8 : కాలుష్య నివారణ పేరుతో ఆర్టీసీ ప్రవేశపెట్టిన జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులు జిల్లాలో పూర్తిస్థాయిలో నడపడంలేదు. ఇటీవల సాంకేతిక కారణాలతో ఈ బస్సులన్నింటినీ డిపోలకు తరలించారు. బస్సుల్లో తరచూ బ్యాటరీ లోపాలు బయటపడడం, అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడంతో తాత్కాలికంగా నిలిపివేశారు. ఆర్టీసీ సాంకేతిక విభాగం ఎలక్ట్రిక్ బస్సులకు క్లియరెన్స్ ఇవ్వడంతో కొన్ని బస్సులు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. మొత్తం 89 బస్సులకు గాను 35 బస్సులను మాత్రమే నడపడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, బోధన్, బాన్సువాడ తదితర ప్రాంతాలకు ఎక్కువగా ఎలక్ట్రిక్ బస్సులు (నాన్ స్టాప్) నడుపుతున్నారు. దీంతో ప్రయాణికులు ఈ బస్సులపై ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం 35 బస్సులు మాత్రమే అందుబాటులో ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ జిల్లాలో ఇటీవల ఎలక్ట్రిక్ బస్సులో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. దీంతో ఆర్టీసీ అధికారులు బస్సుల భద్రతపై అప్రమత్తమయ్యారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సులేమాన్ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను పరిశీలించారు. బస్సుల పనితీరు, సాంకేతిక లోపాలపై ఆరా తీశారు. దీంతో ప్రతి బస్సును క్షుణ్ణంగా సర్టిఫైడ్ చేసి నడుపుతున్నారు.
ప్రస్తుతం 35 బస్సులకు క్లియరెన్స్ ఇవ్వడంతో వాటినే నడుపుతున్నట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు. కరీంనగర్, వరంగల్, నర్సంపేటకు వెళ్లే రూట్లలో బస్సుల కొరత ఏర్పడడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా త్వరలోనే బస్సులు సర్టిఫైడ్ చేసి నడిపిస్తామని తెలియజేస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి మధ్య నడిచే నాన్‌స్టాప్ బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్‌లో పడిగాపులు కాయాల్సి వస్తున్నది. మొత్తం 89 బస్సులకు 54 బస్సులు ప్రస్తుతం డిపోకే పరిమితమయ్యాయి. అధికారులు వెంటనే స్పందించి బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు.
సర్టిఫైడ్ చేసిన తర్వాత బస్సులు నడుస్తాయి
బస్సుల్లో సాంకేతిక లోపం లేకుండా నడిపేందుకు కృషి చేస్తున్నాం. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే బస్సులను సర్టిఫైడ్ చేసి నడిపిస్తున్నాం. ప్రయాణికులు సహకరించాలి.
-ఎస్వీజీ కృష్ణమూర్తి, ఆర్టీసీ ఆర్ఎం