మిర్యాలగూడ, జూలై 11: మిర్యాలగూడ నియోజకవర్గంలో సర్ ప్రక్రియ అంతా అయోమయంగా మారింది. బీఎల్వోఏ ఫారాలైతే ఇచ్చారు కానీ అవి ఎలా నింపాలో తెలియకపోవడంతో నియోజకవర్గ ఓటర్లు తలలు పట్టుకుంటున్నారు. దీనిపై జనంలో ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఇందుకు కారణం ప్రభుత్వం దీనిపై సరైన అవగాహన కల్పించకపోవడమే. బీఎల్వోలు ఇచ్చిన ఫారాల్లో 2002 ఓటరు జాబితాలో పేరు ఉంటే ఒకలా లేకుంటే వారి సంబంధీకుల వివరాలతో మరోలా నింపాలని చెప్పగా ఏది ఎక్కడ నింపితే ఏమి తంటా వస్తుందోనని ఇచ్చిన ఫారాలు నింపకుండా అలాగే తమవద్దే ఉంచుకున్న పరిస్థితి నెలకొంది. 2002 ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలో తెలియక కొంతమంది, నియోజకవర్గ పోలింగ్ బూత్ నంబర్ తెలియక మరికొంతమంది పరిస్థితి అయోమయంగా తయారైంది. గతంలో కిరాయి ఇండ్లలో ఉండి ప్రస్తుతం వేరే ఇంటికి మారిన వారికి ఫారాలు అందలేదు. సర్ ప్రక్రియ గడువు పెంచాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్ వస్తోంది.
2002 జాబితాతో ముడిపెట్టడంతోనే గందరగోళం
ప్రస్తుత వివరాలతో పాటు 2002 ఓటరు జాబితాకు ముడిపట్టడంతో ఓటు లేని వారు వారి సంబంధీకుల వివరాలను నింపాల్సి ఉండగా 2002లో ఓటు ఉంటే సంబంధీకుల వివరాలు ఎక్కడ నింపాలో తెలియక ఫారాలను తమ వద్దే ఉంచుకోవడంతో సర్ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఇదిలా ఉండగా విదేశాలకు వెళ్లే వారి వివరాలు సేకరించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
శ్రమంతా వృధాయేనా..
సర్ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేట్ ఫారాలు ఇంటింటికీ వచ్చి ఇచ్చినప్పటికీ వాటిని నింపే విషయంలో అవగాహన కల్పించకపోవడంతో ఆన్లైన్ ప్రక్రియ ఆలస్యమవుతున్నది. డిజిటలైజేషన్ అయిన తర్వాతే వివరాల పరిశీలన, అభ్యంతరాలు తుది ఓటర్ల జాబితాను వేగవంతం చేసే ఆస్కారం ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు కొంతమేర వీటిపై సందేహాలు నివృత్తి చేస్తున్నప్పటికీ సర్ కార్యక్రమం నత్తనడకన సాగుతోంది. బీఎల్వోలు ఒకేచోట కూర్చొని వచ్చిన వారివే సేకరిస్తుండటంతో మరింత ఆలస్యం జరుగుతోంది.
ఓటు ఉంటదో..పోతదో..
సర్ ప్రక్రియతో కొంతమంది ఓటర్లలో ఆందోళన నెలకొంది. ఓటరు జాబితాలో పేరు కనిపించక పోవడంతో మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం ఉంటుందా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. కిరాయి ఇండ్లలో ఉండే వారు గతంలో ఒక చోట ఓటు ఉంటే ప్రస్తుతం ఉన్న వార్డుకు ఓటు మారుతుందా లేదా అనే సందేహాలు వస్తున్నాయి. 2002 తర్వాత పెండ్లి చేసుకొని అత్తగారింటికి వచ్చిన వారు ఇక్కడ ఓటు నమోదు చేసుకోవాలా అమ్మగారి ఇంటి దగ్గరే ఉంచాలా అర్థం కాక ఓటు పోతుందేమోననే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎట్లా నింపాలో తెలియక..
సిబ్బంది ఇంటికి వచ్చి సర్ ఫారాలు ఇచ్చిన్రు..కానీ ఆ ఫారాలను ఎట్ల నింపాలో తెల్వకు నా కాడనే ఉంచుకున్న.. నాలాంటి చదువురాని వారు ఇరుగు పొరుగు వారితో నింపిద్దామంటే ఆళ్లకు కూడా ఎట్ల నింపాలో తెల్వదంటున్నరు. చదువుకున్నోళ్లకు కూడా ఫారాలు ఎట్ల నింపాల్నో తెలియకపోతే నాలాంటోని పరిస్థితేంది. నాలాంటోళ్ల కోసం అధికారులే చొరవ తీసువాలి.
– మహ్మద్‌గౌస్, షాబునగర్, మిర్యాలగూడ
ఏ వివరాలు నింపాలో..
అంగన్వాడీ టీచర్ మా ఇంటికి వచ్చి ఓటరు ఫారాలు ఇచ్చారు. 2002లో ఓటరు లిస్టులో పేరు చూసుకుని అలాగే నింపాలంటున్నరు. అందులో లేకపోతే మీ పూర్వీకుల వివరాలు నింపాలంటున్నరు. కానీ ఇచ్చిన ఫారమ్‌లో మూడుచోట్ల వివరాలు అడిగుతున్నారు. ఎక్కడెక్కడ ఏ వివరాలు నింపాలో తెలవక ఇబ్బంది పడుతున్నాం. అధికారులు 2002లో ఓటు హక్కు ఉండి నింపిన వారి ఫారమ్, 2002లో ఓటు లేనివారు నింపిన మోడల్ ఫారాలపై అవగాహన కల్పించాలి.
– ధనమ్మ రాంనగర్, మిర్యాలగూడ