వాషింగ్టన్ : అమెరికన్ ఎయిర్‌లైన్స్ గాల్లో వేగంగా దూసుకెళ్తోంది. కానీ ఓ ప్రయాణికుడు మాస్కు ధరించలేదు. దీంతో వేగంగా వెళ్తున్న ఆ విమానంలో అమెరికన్ ఎయిర్‌లైన్స్ సిబ్బందికి, సదరు ప్రయాణికుడికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మాస్కు ధరించాలని ప్రయాణికుడిని కోరినప్పటికీ, అతను వినిపించుకోలేదు. మాస్కు ధరించేందుకు సదరు ప్రయాణికుడు నిరాకరించడంతో.. విమానాన్ని మధ్యలోనే వెనక్కి తీసుకొచ్చారు.
అమెరికన్ ఎయిర్‌లైన్స్ మియామి నుంచి లండన్‌కు గురువారం బయల్దేరింది. అయితే ఓ ప్రయాణికుడు మాస్కు పెట్టుకోలేదు. మాస్కు పెట్టుకోవాలని సిబ్బంది అతనికి సూచించారు. కానీ అతను నిరాకరించాడు. ప్రయాణికుడి ప్రవర్తనతో విసిగిపోయిన సిబ్బంది.. ఆ విమానాన్ని మళ్లీ మియామి ఎయిర్‌పోర్టులోనే ల్యాండ్ చేశారు. లండన్‌కు బయల్దేరిన అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో 129 ప్రయాణికులతో పాటు 14 మంది సిబ్బంది ఉన్నారు.
మియామి ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ కాగానే సదరు ప్రయాణికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు అమెరికన్ ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది. ప్రతి విమాన ప్రయాణికుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ 2021, జనవరిలో ఉత్తర్వులు జారీ చేసింది.