RTC Bus Fare | పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా బాదుడు మొదలుపెట్టింది. వినాయక చవితి సందర్భంగా టికెట్ ధరలను దాదాపు 40 శాతం పెంచేసిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వినాయక చవితి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రయాణికులు పెద్ద సంఖ్యలో సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో బస్సులకు డిమాండ్ పెరగడంతో టికెట్ ధర కూడా పెరిగిందంటూ ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి హన్మకొండ వెళ్లే ఏసీ బస్సు టికెట్ సాధారణంగా రూ.410 ఉంటుందని, అయితే పండుగ సందర్భంగా అదే ప్రయాణానికి రూ.570 వసూలు చేశారని ఓ ప్రయాణికుడు పేర్కొన్నాడు. అంటే ఒక్క టికెట్‌పై రూ.160 అదనంగా చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
తనకు అందిన టికెట్‌ను చూపిస్తూ సాధారణంగా ఉండే చార్జీతో పోలిస్తే దాదాపు 39 శాతం అదనంగా వసూలు చేశారని ఆయన ఆరోపించారు. ప్రతిసారి ఇలా పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ చార్జీలను భారీగా పెంచడంపై ప్రజలు మండిపడుతున్నారు.