న్యూఢిల్లీ, డిసెంబర్ 14: అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తున్న స్మార్ట్‌ఫోన్ కారణంగా వాస్తవ ప్రపంచాన్ని మరిచిపోయే వారు ఎక్కువవుతున్నారు. కన్నబిడ్డలను సైతం పట్టించుకోకుండా మొబైల్లోనే ముఖం పెట్టుకొంటున్న పేరెంట్స్ అంతకంతకూ పెరిగిపోతున్నారు. సాక్షాత్తూ తల్లిదండ్రులే ఈ వాస్తవాన్ని అంగీకరించడం గమనార్హం. స్మార్ట్‌ఫోన్ వాడకం వల్ల తాము పిల్లలతో సరిగా ఉండలేకపోతున్నట్టు ప్రతి 10 మందిలో ఏడుగురు పేరెంట్స్ ఒప్పుకుంటున్నారు.
మానవ సంబంధాలపై స్మార్ట్‌ఫోన్ ప్రభావం ఎలా ఉన్నదన్న అంశంపై స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ‘వివో’, సైబర్ మీడియా రిసెర్చ్ (సీఎంఆర్) సంస్థతో కలసి దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లోని 1,100 మందిపై ఈ అధ్యయనం నిర్వహించింది. స్మార్ట్‌ఫోన్‌పై రోజులో గడిపే సమయం కరోనా ముందుతో పోలిస్తే ప్రస్తుతం దాదాపు 32 శాతం పెరిగిందని, ఇది ప్రమాదకరమైన సంకేతం అని నివేదికలో పేర్కొన్నది. నైతికంగా, సామాజికంగా ఇది పిల్లలపై పెను ప్రభావం చూపిస్తుందని హెచ్చరించింది.