కామేపల్లి, మార్చి, 28: కొమ్మినేపల్లి పంచాయతీ పండితాపురంల్నో శ్రీకృష్ణప్రసాద్ పశువుల సంత బహిరంగ వేలం రికార్డు స్థాయి పలికింది. సోమవారం సంత ఆవరణలో సర్పంచ్ మూడ్ దుర్గాజ్యోతి అధ్యక్షతన జడ్పీ సీఈవో ఇంజం అప్పారావు 2022-23 ఆర్థిక సంవత్సరానికి బహిరంగ వేలం నిర్వహించగా ధరావత్ నాగేశ్వరరావు, భూక్యా వీరన్న అనే కాంట్రాక్టర్లు పోటాపోటీగా వేలం పాడారు. ప్రభుత్వ మద్దతు ధర రూ.1.93 కోట్లు కాగా భుక్యా వీరన్న రూ.2.16 కోట్లకు వేలం పాడి సంత కౌలును కైవసం చేసుకున్నాడు. ఇది ప్రభుత్వ మద్దతు ధరకంటే రూ.22.80 లక్షలు ఎక్కువ. ఈ నెల 24న బహిరంగ వేలం నిర్వహించగా నలుగురు కాంట్రాక్టర్లు మాత్రమే వేలానికి హాజరయ్యారు. భూక్యా వీరన్న అనే కాంట్రాక్టర్ రూ.1.78 కోట్లకు వేలం పాడాడు. వేలం ప్రభుత్వ మద్దతు ధరకంటే తక్కువ పలకడంతో అధికారులు వేలాన్ని రద్దు చేశారు. వేలంలో పాల్గొన్న ఒక్కో వ్యక్తి ధరావత్ సొమ్ము రూ.30 లక్షలు, సాల్వెన్సీ రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వానికి నగదు చెల్లించి పాటలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సీఐ ఆరిఫ్ అలీఖాన్, ఎస్సై లక్ష్మీభార్గవి ఆధ్వర్యంలో సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో డీఎల్పీవో పుల్లారావు, ఎంపీడీవో సీలార్సాహెబ్, ఎంపీవో సత్యనారాయణ, ఉప సర్పంచ్ కొమ్మినేని శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి నెహ్రూ పాల్గొన్నారు.