హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండోరోజు జోరందుకున్నది. శనివారం ఒక్కరోజే గడువు ఉండటంతో శుక్రవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. తొలివిడత ఎన్నికల నిర్వహణ కోసం గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నోటిఫికేషన్ జారీచేయగా నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలివిడతలో 4,236 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 796 నామినేషన్లను అభ్యర్థులు అందజేశారు.
అత్యల్పంగా ములుగు జిల్లాలో 63, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 93 నామినేషన్లు వచ్చాయి. తొలి విడత ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల శనివారం సాయంత్రం ఐదు గంటలతో ముగియనున్నది. 30న నామినేషన్ల పరిశీలన, అదేరోజు సాయంత్రం 5 గంటలకు చెల్లుబాటైన నామినేషన్ల అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అదేరోజు బరిలో నిలిచి అభ్యర్థుల తుదిజాబితాను అధికారులు ప్రకటిస్తారు.
