పంచనారసింహుడు కొలువైన యాదాద్రి క్షేత్రంలో మహాకుంభ సంప్రోక్షణ పర్వాలు వైకుంఠ వైభవాన్ని తలపిస్తున్నాయి. ఐదో రోజు శుక్రవారం ప్రధానాలయంలో ఏకోన పంచాషట్ కలశాభిషేకం చేపట్టారు. శిలామూర్తులైన ఆండాళ్ అమ్మవారు, ఆళ్వారులు, విష్వక్సేనుడు, గరుత్మంతుడితోపాటు దివ్యవిమాన గోపురానికి పునఃప్రతిష్ఠించనున్న సుదర్శన చక్రం,
బలిపీఠాలకు 49 కలశాలను అభిషేకించి మంత్రపూర్వకంగా పంచామృతాధివాసం జరిపించారు. అనంతరం నిత్యలఘు పూర్ణాహుతి నిర్వహించారు. బాలాలయంలో పంచకుండాత్మక మహా యాగం, శాంతిపాఠం, చతుఃస్థానార్చన, మూలమంత్ర, మూర్తి మంత్ర హవనాలు, సామూహిక విష్ణు సహస్రనామార్చన కొనసాగాయి.
యాదాద్రి, మార్చి 25 : మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా యాదాద్రి ప్రధానాలయంలో అభిషేక పర్వాలు శాస్ర్తోక్తంగా సాగుతున్నాయి. శుక్రవారం ఉదయం 11గంటలకు ఏకో పంచాషట్ కలశాభిషేకంలో భాగంగా శిలామూర్తులైన ఆండాళ్ అమ్మవారు, ఆళ్వారులు, విష్వక్సేనుడు, గరుత్మంతుడి విగ్రహాలు, దివ్య విమాన గోపురానికి పునః ప్రతిష్టించే సుదర్శన చక్రం, బలిపీఠాలకు 49కలశాలతో అభిషేకం చేశారు. 25తత్వాలు, 15తిథులు, ఏడు వారాలు, రెండు పక్షాలు కలిపి ప్రకృతిలోని 49తత్వాలతో ఆయా మంత్ర జలాలతో అభిషేకించారు. 49కలశాలలో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, సుగంధ ద్రవ్యాలను కలిపి శుద్ధోదకాలను ఆయా కలశాలలో నింపి వేదమంత్ర పఠనాలతో ఆయా మూర్తులను అభిషేకించారు. మంత్రాలతో ఆవాహన చేసిన 49తత్వాలు విశేషమైన ఫలాలు అందిస్తాయని ప్రధానార్చకుడు నల్లన్‌థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. పెరుగు స్థిర, దృఢబుద్ధికి సంకేతం, తేనె, పంచదార భాగవత ఆనందానికి సంకేతమని తెలిపారు. 25కాల సంబంధమైన, 15తిథులు, సంవత్సర సూచకములైన రెండు అయనాలు, వారాలు ఎంతో మహిమాన్వితమని తెలిపారు. అన్ని భగవత్ స్వరూపాలేనని వాటితో ఉత్సవాలు నిర్వహించిన భగవానుడికి ప్రీతి కలుగుతుందని తెలిపారు.
మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా బాలాలయంలో శుక్రవారం పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారం హోమాలు, హవనాలు సాగుతున్నాయి. ఉదయం 9గంటలకు స్వామి, అమ్మవార్లకు నిత్యారాధనలు, అభిషేకాల అనంతరం శాంతిపాఠం, చతుస్థానార్చనలు, మూలమంత్ర, మూర్తిమంత్ర హవనాలు జరిపారు. అనంతరం యాగశాలలో పంచకుండాత్మక మహాయాగాన్ని ప్రారంభించారు. మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా సాయంత్రం 6గంటలకు స్వామి నిత్యారాధనల అనంతరం రుత్వికులు సామూహిక శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం గావించారు. చతుస్థానార్చనలు, మూలమంత్ర, మూర్తిమంత్ర హవనాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్.గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ప్రధానార్చకులు నల్లన్‌థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, చింతభట్ల రంగాచార్యులు, బట్టర్ సురేంద్రాచార్యులు, మరింగంటి శ్రీధరాచార్యులు, ఆలయ ఏఈఓలు గజవెల్లి రమేశ్‌బాబు, దోర్భల భాస్కర్‌శర్మ, గట్టు శ్రవణ్‌కుమార్ పాల్గొన్నారు.