తెలంగాణ భవన్లో నిర్వహించిన బీఆర్ఎస్ మాక్ అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖ మంత్రి పాత్రలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “మాకు బ్యాంకు చెక్కులు అంటే అర్థమవుతుంది.. కానీ క్యూసెక్కులు అంటే మాకు అర్థం కాదు” అంటూ సాగునీటి శాఖ పనితీరుపై సెటైర్ వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేస్తే కేసీఆర్కు పేరు వస్తుందని, అందుకే తాము ఆ పని చేయబోమని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
“సబ్జెక్ట్ నేను ప్రిపేర్ అయి సభకు రాలేదు. సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్ చెప్పినట్లు నేను మాట్లాడుతాను. బ్యాంకు చెక్కులు అంటే అర్థం అవుతుంది.. క్యూసెక్కులు అంటే మాకు అర్థం కాదు” అంటూ పల్లా రాజేశ్వర్రెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తాను ఆర్మీలో పనిచేసినందున డిసిప్లిన్ గురించి తెలుసునని పేర్కొన్న పల్లా.. ముఖ్యమంత్రి బూతుల ప్రభావం ఎక్కువైందంటూ సెటైర్ వేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు పేరు వస్తుందని, కేసీఆర్కు పేరు వచ్చే పనులు తాము చేయబోమని పల్లా వ్యాఖ్యానించారు. అలాగే మేడిగడ్డ బ్యారేజీని కూడా తాము బాగు చేయబోమంటూ వ్యంగ్యంగా అన్నారు.
తమ్మిడిహట్టి ప్రాజెక్టును 2004లోనే నిర్మించాలని అనుకున్నామని పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. అయితే మహారాష్ట్రలో తమ ప్రభుత్వమే ఉన్నప్పటికీ అనుమతి ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. దశాబ్దం ఆలస్యమైన తమ్మిడిహట్టి ప్రాజెక్టును నిర్మిస్తామని పేర్కొన్నారు.
KRMB, GRMB సమావేశాల్లో సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్ ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతానని పల్లా వ్యంగ్యంగా అన్నారు. CWC సమావేశాన్ని కాంగ్రెస్ సమావేశంగా భావించానని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి చంద్రబాబు కారణమని పల్లా పేర్కొన్నారు. “చంద్రబాబు నాయుడు రుణం మేము తీర్చుకోవద్దా?” అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు.
కర్ణాటకలో 40 శాతం కమిషన్ తీసుకుంటే.. తెలంగాణలో 30 శాతం కమిషన్ తీసుకుంటున్నామని, అందులో తప్పేముందని పల్లా సెటైర్ వేశారు. కాంగ్రెస్ అంటేనే ఫ్యామిలీలా కూటమి అని వ్యాఖ్యానించారు. చివరగా “మాకు సోనియా గాంధీ సర్టిఫికెట్ ఉంటే చాలు” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై పల్లా రాజేశ్వర్రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.