AP News : దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర (South Odisha-Utharandhra) తీర ప్రాంతాల్లో నెలకొన్న అల్పపీడన (Low Pressure Area) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీని ఫలితంగా శని, ఆదివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ (Prakhar Jain) తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ హై అలర్ట్ ప్రకటించింది.
విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో, దక్షిణ కోస్తాలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
అలాగే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రజలకు కీలక సూచనలు చేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు కురిసే సమయంలో చెట్ల కింద, భారీ హోర్డింగ్ల సమీపంలో ఉండరాదని కోరారు. ముఖ్యంగా మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని ఆమె స్పష్టమైన హెచ్చరికలు జారీచేశారు.
అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.