Hafiz Saeed | న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి సూత్రధారిగా భావిస్తున్న పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌కు పాకిస్థాన్ భద్రతను కట్టుదిట్టం చేసింది. పాక్ సాయుధ దళాలు అతడికి 24×7 భద్రతను కల్పిస్తున్నాయి. లాహోర్‌లోని సయీద్ నివాసం చుట్టూ నిఘాను పెంచాయి. లాహోర్‌లోని మొహల్లా జోహార్ పట్టణంలో అత్యంత రద్దీ ప్రాంతంలో హఫీజ్ సయాద్ నివాసం ఉంది.
ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం దాడి, అనంతర ఉద్రిక్తతల నేపథ్యంలో అతడి ఇంటి చుట్టూ పాక్ ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. పాకిస్థాన్ సైన్యం, ఆ దేశ గూఢచార సంస్థ ఐఎస్ఐ, లష్కరే కలిసి సంయుక్తంగా అతడి భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. డ్రోన్లతోనూ పహారా కాస్తున్నారు. అతడి ఇంటికి నాలుగు కిలోమీటర్ల పరిధిలో అత్యంత శక్తిమంతమైన సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సామాన్య ప్రజలు ఎవరినీ అటువైపు అనుమతించడం లేదు.