Pakistan : అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకొచ్చిన ‘అబ్రహం ఒప్పందం (Abraham deal)’ ప్రతిపాదనను పాకిస్థాన్ (Pakistan)తిరస్కరించింది. ఇజ్రాయెల్ (Israel) తో సంబంధాలను సాధారణీకరించుకోవాలంటూ ట్రంప్ చేసిన విజ్ఞప్తిని తాము అంగీకరించబోమని స్పష్టంచేసింది. ఇరాన్‌తో కుదుర్చుకోబోయే శాంతి ఒప్పందంలో భాగంగా సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ, ఈజిప్ట్, జోర్డాన్‌తోపాటు పాకిస్థాన్ కూడా అబ్రహం ఒప్పందంపై సంతకం చేయడం తప్పనిసరి అని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. దాంతో ఈ వివాదం మొదలైంది.
ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ ఘాటుగా స్పందించారు. తమ దేశ ప్రాథమిక సిద్ధాంతాలు, ఆదర్శాలకు విరుద్ధంగా ఉండే ఎలాంటి ఒప్పందాల్లోనూ తాము భాగస్వామ్యం కాబోమని అన్నారు. ఒక్కరోజు కూడా మాట మీద నిలబడని, నమ్మకద్రోహానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఇజ్రాయెల్‌తో తాము కలిసి కూర్చోవడం అసాధ్యమని ఆయన తేల్చిచెప్పారు. తమ దేశ అధికారిక విధానం ప్రకారం ఇజ్రాయెల్‌ను ఒక దేశంగా గుర్తించే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు.
ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ పోస్ట్‌లో.. ఇరాన్‌తో అమెరికా జరుపుతున్న చర్చలు ఒక కొలిక్కి వస్తున్నాయని, ఈ చారిత్రాత్మక ఒప్పందంలో భాగం కావాలంటే ముస్లిం దేశాలన్నీ ఇజ్రాయెల్‌తో సత్సంబంధాలు పెట్టుకోవాల్సిందేనని షరతు పెట్టారు. దీనిపై పాకిస్థాన్ ప్రభుత్వ వర్గాలు మండిపడుతున్నాయి. ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలకు, అబ్రహం ఒప్పందానికి ఎలాంటి సంబంధం లేదని, ఎవరో ఒత్తిడి తెచ్చారని లొంగిపోయే పరిస్థితిలో పాకిస్థాన్ లేదని ఆ దేశ ప్రభుత్వ వర్గాలు స్పష్టంచేశాయి.
అదేవిధంగా సౌదీ అరేబియా కూడా ట్రంప్ ప్రతిపాదనను తోసిపుచ్చింది. స్వతంత్ర పాలస్తీనా దేశ ఏర్పాటుకు సంబంధించి స్పష్టమైన, శాశ్వతమైన మార్గం సుగమం అయ్యేవరకు ఇజ్రాయెల్‌తో చేతులు కలిపేది లేదని సౌదీ పేర్కొన్నది. గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక దాడులపట్ల ముస్లిం దేశాల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న తరుణంలో ఈ అబ్రహం ఒప్పందాన్ని విస్తరించాలనే ట్రంప్ ఆశలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న శత్రుత్వాన్ని ముగించి.. దౌత్య, ఆర్థిక, రక్షణ సంబంధాలను మెరుగుపరిచేందుకు 2020లో ట్రంప్ ఆధ్వర్యంలో ఈ ‘అబ్రహం అకార్డ్స్’ ప్రారంభమయ్యాయి. మొదట యూఏఈ, బహ్రెయిన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేయగా.. ఆ తర్వాత మొరాకో, సూడాన్, కజకిస్థాన్ ఇందులో చేరాయి.