Pakistan | భారత్ అంటేనే గిట్టని దేశం పాకిస్థాన్. దేశంలో అలజడులు సృష్టించేందుకు ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నది. భారత్‌లో అలజడులు సృష్టించేందుకు ఉగ్రమూకలతో కలిసి శతవిధాల ప్రయత్నిస్తున్నది. ముష్కరులను సరిహద్దులు దాటించి దాడులకు తెగబడేందుకు కుట్రలు చేస్తూనే ఉంటుంది. అయితే, ఆ ఉగ్రవాదమే ప్రస్తుతం ఆ దేశానికి తలనొప్పిగా మారింది. తాను తొవ్వుకున్న గోతిలో తానే పడ్డట్లుగా అయ్యింది ఆ దేశం పరిస్థితి. ఉగ్రవాదంతో గత ఆర్నేళ్లలో ఎన్నడూ లేని విధంగా 2023 సంవత్సరంలో హింస చెలరేగింది. గతేడాదిలో పాకిస్థాన్‌లో జరిగిన ఉగ్రవాద ఘటనల్లో 1,524 మంది ప్రాణాలు కోల్పోయారు.
పాకిస్తాన్ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ (CRSS) ఈ విషయం వెల్లడైంది. 2023 సంవత్సరంలో 789 తీవ్రవాద దాడులు, ఉగ్రవాద కార్యకలాపాలతో 1524 మంది మరణించగా.. 1463 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో వెయ్యి మంది పౌరులు, ఇతర భద్రతా దళాల సిబ్బంది ఉన్నారు. ఉగ్రవాద ఘటనల్లో మృతుల సంఖ్య గత ఆరేళ్లలో ఇదే అత్యధికం. ఇంతకు ముందు 2018 సంవత్సరంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. నివేదిక ప్రకారం.. 2021 సంవత్సరం నుంచి పాకిస్తాన్లో ఉగ్రవాద దాడులు పెరుగుతూ వస్తున్నాయి. ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్తాన్ తీవ్రవాదదాడులకు కేంద్రాలుగా మారాయి.
గరిష్ఠంగా రెండు రాష్ట్రాల్లోనే 84శాతం ఉగ్రవాద దాడులు జరిగాయి. మరణించిన వారిలో 90శాతం మంది ఈ రెండు రాష్ట్రాలకు చెందినవారే. పంజాబ్, సింధ్ ప్రావిన్స్‌లలో ఎనిమిది శాతం ఉగ్రవాద ఘటనలు జరిగాయి. నివేదిక ప్రకారం, 2023లో పాకిస్తాన్లో ఉగ్రవాద సంఘటనలు 56 శాతం పెరిగాయి. 2022లో పాకిస్తాన్లో జరిగిన ఉగ్రవాద సంఘటనలలో 980 మంది మరణించారు. ఈ సంఖ్య 2023 నాటికి 1524కి పెరిగింది. పంజాబ్, సింధ్ ప్రావిన్సుల్లో ఉగ్రవాద సంఘటనలు తగ్గినప్పటికీ.. మరణాలు పెరిగాయి.
విశేషమేమిటంటే తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్థాన్, బలూచ్ లిబరేషన్ ఆర్మీ, ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ తదితర నిషేధిత సంస్థలు ఉగ్రదాడులకు పాల్పడ్డాయి. పాకిస్థాన్ సైన్యం ఉగ్రవాదులపై 197 ఆపరేషన్లు నిర్వహించగా, 545 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. థింక్ ట్యాంక్ పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాన్ఫ్లిక్ట్ అండ్ సెక్యూరిటీ స్టడీస్.. వార్షిక నివేదికలో పాకిస్తాన్లో ఉగ్రవాద సంఘటనలు పెరుగుతున్నాయని పేర్కొంది. నివేదిక 2023 సంవత్సరంలో పాకిస్తాన్లో ప్రతి నెలా 53 ఉగ్రదాడులు జరగ్గా.. 2022లో ఈ సంఖ్య 32గా ఉంది.