అచ్చంపేట, మే 3 : నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంటకు చెందిన పద్మశ్రీ అవార్డుగ్రహీత 12మెట్ల కిన్నెర కళాకారుడు మొగులయ్య ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయ్యింది. 2022 మార్చి 21న పద్మశ్రీ అందుకొన్న ఆయనకు కేసీఆర్ ప్రభుత్వం రూ.కోటి నజరానా ప్రకటించింది. పిల్లల పెండ్లిళ్లు చేయడంతోపాటు హైదరాబాద్ శివారులోని తుర్కయాంజాల్‌లో 100 గజాల్లో ఇల్లు నిర్మించుకుంటున్నాడు. డబ్బులు సరిపోక పనులు ఆపేశాడు. కళాకారుడిగా రూ.10 వేలు పింఛన్ వస్తున్నది. కుటుంబ పోషణకు పింఛన్ సరిపోవడం లేదని, హయత్‌నగర్‌లో ఇంటి స్థలం కోసం జీవో ఇచ్చినా అధికారులు స్థలం అప్పగించలేదని మొగులయ్య ఆవేదన వ్యక్తం చేసినట్టు సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. మొగులయ్య తుర్కయాంజాల్‌లో గృహనిర్మాణ పనులకు వెళ్లినట్టు కళాకారుడు ఆవేదన వ్యక్తం చేసినట్టు ఆ వీడియో మీడియాలో హల్చల్ చేసింది. శుక్రవారం మొగులయ్యను ‘నమస్తే తెలంగాణ’ ఫోన్లో పలుకరించగా.. కష్టాలను చెప్పుకొచ్చాడు. కేసీఆర్ ప్రభుత్వం తన కిన్నెర వాయిద్య కళను గుర్తించి ఉగాది పురస్కారం అందజేసిందని, కేంద్రం పద్మశ్రీతో సత్కరించిందని తెలిపారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలువగా పింఛన్ రూ.25 వేలతోపాటు హయత్‌నగర్‌లో 600 గజాల స్థలాన్ని ఇచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్టు చెప్పుకొచ్చాడు. అయితే తనకు పింఛన్ రావడం లేదని సోషల్ మీడియాలో వచ్చిన కథనాల్లో నిజం లేదని, తనకు రూ.10 వేల పింఛన్ వస్తుందని, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో మరింత పెంచాలని మొగులయ్య ప్రభుత్వాన్ని కోరాడు.
మొగిలయ్య కుటుంబానికి అండగా ఉంటాం
పద్మశ్రీ మొగిలయ్య కుటుంబానికి అండగా ఉంటామని కేటీఆర్ చెప్పారు. కుటుంబాన్ని పోషించడానికి మొగిలయ్య కూలీ పనులకు వెళ్తున్నట్టు మీడియాలో వచ్చిన వార్తలపై కేటీఆర్ స్పందించారు. మొగిలయ్యను వెంటనే సంప్రదించి ఆదుకుంటామని వెల్లడించారు.