జోగులాంబ గద్వాల : జిల్లాలో వరిధాన్యం(Paddy) కొనుగోలు చేసిన వెంటనే మిల్లులకు తరలించాలని, వర్షాల నుంచి ధాన్యం తడవకుండా టార్పలిన్లతో (Tarpaulins) భద్రపరచాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ (Collector BM Santosh ) అధికారులను ఆదేశించారు. గద్వాల్ మండలంలోని చెనుగొనిపల్లి, గుంటిపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ నర్సింగ రావుతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, తేమ శాతం,లారీ లోడింగ్, ఓపియంఎస్లో డేటా ఎంట్రీ తదితర అంశాలను పరిశీలించారు. వర్షాలు పడే అవకాశం ఉన్నందున, ధాన్యం తడిపోయే ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ధాన్యంలో తేమ శాతం 17శాతానికి చేరగానే వెంటనే సంచుల్లో నింపి, లారీలలో లోడ్ చేసి మిల్లులకు తరలించాలని, వర్షాలు వచ్చినపుడు వాహనాలు వచ్చే వరకు సంచులను టార్పాలిన్లతో కప్పి సురక్షితంగా ఉంచాలని ఆదేశించారు.
కొనుగోలు కేంద్రానికి అవసరమైన గన్ని సంచులు, లారీల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. ధాన్యం రవాణా పనులు ఏ మాత్రం ఆలస్యం కాకుండా ఉండేందుకు అవసరమైన హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో మాట్లాడి కేంద్రంలో అందుతున్న సౌకర్యాలు,వసతుల గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పౌర సరఫరాల జిల్లా మేనేజర్ విమల, అడిషనల్ డీఆర్డీవో నర్సింహులు, మండల వ్యవసాయాధికారులు, ఏపీఎంలు, రైతులు పాల్గొన్నారు.